సింగయ్యను తొక్కి చంపింది జగన్ కారే!

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మొన్నటి రెంటపాళ్ల పర్యటనలో వైసీపీకి చెందిన ఇద్దరు కార్యకర్తలు మృతి చెందిన సంగతి తెలిసిందే. వీరిలో సింగయ్య అనే వ్యక్తి జగన్ కాన్వాయ్ లోని వాహనం కింద పడి నలిగాడని నాడు వార్తలు వినిపించాయి. ఆ తర్వాత ఆయనను ఆసుపత్రికి తరలించగా..చికిత్స పొందుతూ చనిపోయాడని పోలీసులు ప్రకటించారు. తాజాగా సింగయ్య మృతికి సంబంధించిన అసలు వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అందులో జగన్ ప్రయాణిస్తున్న కారు ముందు చక్రం కింద పడే సింగయ్య నలిగిపోయాడు. ఈ దృశ్యాలు వీడియోల్లో విస్పష్టంగా కనిపిస్తున్నాయి.

జగన్ రెంటపాళ్ల టూర్ కు పల్నాడు జిల్లా పోలీసులు షరతులతో కూడిన అనుమతులు ఇవ్వగా… వైసీపీ నేతలు వాటినేమీ పట్టించుకోకపోవడం గమనార్హం. పోలీసు ఆంక్షలను లెక్కచేయకుండా జగన్ వెంట వేలాది మంది వైసీపీ కార్యకర్తలు తరలివచ్చారు. ఈ క్రమంలో గుంటూరు దాటిన తర్వాత ఏటుకూరు బైపాస్ వద్ద జగన్ తన కారు నుంచి ఫుట్ బోర్డుపై నిలబడి పార్టీ శ్రేణులకు అభివాదం చేస్తున్నారు. ఆ సమయంలో కారు కాస్తంత స్లోగానే వెళుతుండగా… ఎవరైనా తోశారో, లేదంటే పట్టుతప్పి పడిపోయాడో తెలియదు గానీ…జగన్ కారు ముందు టైరు కింద సింగయ్య పడిపోయాడు.

ఈ విషయాన్ని జగన్ గమనించలేదు. అంతేకాకుండా ఆ దిశగా ఆయన తిరిగి కూడా చూడలేదు. అయితే కారుకు జగన్ వైపునకు అభిముఖంగా ఉన్న వ్యక్తులు సింగయ్య కారు టైరు కింద పడిపోవడాన్ని గమనించి కారును నిలిపారు. అప్పటికే సింగయ్య గొంతుపైకి టైరు ఓ మోస్తరుగా ఎక్కేసింది. అయితే ఆ తర్వాత కారు టైరు కాస్తంత వెనక్కు వచ్చి నిలిచింది. ఇక్కడిదాకే ఆదివారం వెలుగులోకి వచ్చిన వీడియోలు రికార్డు అయ్యాయి. ఆ తర్వాత సింగయ్యను ఎలా బయటకు తీశారు? అసలు సింగయ్యను జగన్ చూశారా? చూడకుండానే వెళ్లిపోయారా? అన్న వివరాలు తెలియరాలేదు.

ఇదిలా ఉంటే… జగన్ రెంటపాళ్ల టూర్ లో రప్పా రప్పా పోస్టర్ ఘటన పెను కలకలం రేపిన సంగతి తెలిసిందే. పుష్ప 2 సినిమాలోని ఈ మొత్తం డైలాగును రాసుకుని దానిపై జగన్ బొమ్మను వేసుకుని వచ్చిన రవితేజ అనే కార్యకర్త దానిని జగన్ కు కనిపించేలా నానా యత్నం చేశాడు. ఇందుకోసం అతడు ఏకంగా జగన్ కారు బానెట్ ను ఎక్కి నానా హంగామా చేశాడు. ఈ ఘటన అంతా సింగయ్య జగన్ కారు టైరు కింద నలిగిన చోటే జరగడం గమనార్హం. ఓ వైపు సింగయ్య జగన్ కారు టైరు కింద నలుగుంటే… రవితేజ రప్పా రప్పా ప్లకార్డు చేతబట్టి అదే కారు బానెట్ పై చిందులు తొక్కడం గమనార్హం. సింగయ్య కారు కింద పడ్డారని ఓ వ్యక్తి అరుస్తున్నా జగన్ అటు వైపు చూడకపోగా… రవితేజ అయితే ఆ మాటలనే పట్టించుకోకుండా చిందులు తొక్కాడు.