మోడీ-లోకేష్… పెరుగుతున్న బాండింగ్ ..!

మంత్రి నారా లోకేష్- ప్రధానమంత్రి నరేంద్ర మోడీల మధ్య బాండింగ్ మరింత పెరుగుతోంది. ఇది భవిష్యత్తులో మంచి ఫలితాలను ఇచ్చే అవకాశం ఉందని పరిశీలకులు చెబుతున్నారు. కొన్నాళ్ల కిందట అమరావతిలో జరిగిన పున ప్రారంభ పనుల ఘట్టంలోనూ.. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నారా లోకేష్ ను కొనియాడారు. ఒకసారి తన వద్దకు రావాలని ఆతిధ్యం స్వీకరించాలని కూడా ఆయన చెప్పారు. ఆ తర్వాత నారా లోకేష్ కుటుంబంతో సహా ఢిల్లీ వెళ్లడం తాను చేసిన యువ‌గ‌ళం పాదయాత్రకు సంబంధించిన పుస్తకాన్ని కానుకగా మోడీకి అందించడం తెలిసిందే.

వాస్తవానికి నారా లోకేష్ వయసుతో పోల్చుకుంటే మోడీ 70 ఏళ్ల దాటిన నాయకుడు. అయినా ఇంత చనువుగా ఉండడం ఆసక్తికర విషయం. తాజాగా విశాఖపట్నంలో జరిగిన యోగా కార్యక్రమాలను మోడీ నారా లోకేష్ ను ఆకాశానికి ఎత్తేసారనే చెప్పాలి. నారా లోకేష్ కృషి పట్టుదల కలిగిన యువ నాయకుడిగా అభివర్ణించారు. అయితే అటు అమరావతిలోనూ ఇటు విశాఖపట్నంలోనూ మోడీ చేసిన వ్యాఖ్యలను నారా లోకేష్ సీరియస్ గానే తీసుకున్నారు. భవిష్యత్తులోనూ ఆయన మరింతగా కష్టపడేందుకు అవకాశం కూడా ఉంది.

ఇదిలా ఉంటే అసలు ఏమాత్రం వ్యూహం లేకుండానే ప్రధాని మోడీ.. నారా లోకేష్ ను ఆకాశానికి ఎత్తేశారా? అంటే కాదనే చెప్పాలి. ఎందుకంటే ఒక బలమైన యువశక్తిని ప్రోత్సహించాలనేది మోడీ గత కొన్నాళ్లుగా ఆలోచన చేస్తున్న విషయం. 2029 నాటికి దేశవ్యాప్తంగా యువతకు సంబంధించిన ఓటు బ్యాంకు పెరుగుతోంది. యువ నాయకులను ప్రోత్సహించాలని మోడీ కొన్నాళ్లుగా ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. బిజెపితో అనుబంధం ఉన్న పార్టీలకు సంబంధించిన యువ నాయకులు ఆయన తరచుగా ప్రోత్సహిస్తున్నారు.

ఈ క్రమంలోనే రాష్ట్రంలో నారా లోకేష్ ను ఆయన ప్రోత్సహిస్తున్నారనేది పరిశీలకులు భావిస్తున్నారు. తద్వారా రాష్ట్రంలో ప్రత్యామ్నాయ శక్తులు ఎదగకుండా రాజకీయంగా నారా లోకేష్ బలోపేతం అయితే అది తమ‌కు కూడా మేలు చేస్తుంది అనేది మోడీ భావనగా ఉందని ప‌రిశీల‌కులు అంటున్నారు. దీనిని ఎలా మలుచుకుంటారు, తనంతట తాను ఎలా మరింత మెరుగులు దిద్దుకుంటారు అనేది నారా లోకేష్ చేతిలోనే ఉంది. మోడీ ఆద‌రించిన నాయ‌కుల్లో హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌కు చెందిన యువ‌నాయకుడు, జార్ఖండ్ కు చెందిన యువ నాయ‌కులు చాలా మందే ఉన్నారు. ఈ ప‌రంప‌ర‌లో ఇప్పుడు లోకేష్ కూడా చేరుతుండ‌డం గ‌మ‌నార్హం.