పవన్ ఫ్లైట్ లో టెక్నికల్ ప్రాబ్లెమ్!

అహ్మదాబాద్ లో ఇటీవల జరిగిన ఎయిర్ ఇండియా విమానం ప్రమాదానికి గురైన దగ్గర నుంచి అసలు విమాన ప్రయాణాలంటేనే జనం హడలెత్తిపోతున్నారు. అయితే బిజినెస్ మెన్, పొలిటీషియన్లు, ఇతరత్రా అత్యవసర పనులు ఉన్నవారు తప్పనిసరి పరిస్థితుల్లో విమాన ప్రయాణాలను ఎంచుకోక తప్పడం లేదు. అయినా కూడా వారిలో ఎక్కడో భయం బిక్కుబిక్కుమంటూనే ఉంది. తాజాగా జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రయాణించిన విమానం లోనూ సాంకేతిక లోపం తలెత్తింది. ఈ ఘటనపై విమానయాన సంస్థల తీరుపై జనాగ్రహం వ్యక్తం అవుతోంది.

తమిళనాడులో ఆదివారం రాత్రి జరగనున్న మురుగన్ మానాడుకు హాజరయ్యేందుకు ఆదివారం ఉదయం తర్వాత పవన్ ప్రత్యేక విమానంలో మధురై బయలుదేరేందుకు సిద్ధపడ్డారు. ఈ క్రమంలో డిప్యూటీ సీఎం హోదాలో ఆయనకు ఓ ప్రత్యేక విమానం కేటాయించగా… అందుకోసం ఓ ప్రైవేట్ విమానయాన సంస్థ తన విమానాన్ని సమకూర్చింది. ఈ విమానం ఎక్కేందుకు పవన్ ఎయిర్ పోర్టుకు రాగానే… విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. చాలా సేపటికి గానీ ఆ సమస్య పరిష్కారం కాలేదు. అప్పటిదాకా పవన్ వేచి చూడక తప్పలేదు.

సరే… సాంకేతిక లోపాన్ని సవరించిన తర్వాత అదే విమానంలో పవన్ మధురై బయలుదేరి వెళ్లారు. ఈ క్రమంలో పవన్ టూర్ లో ఒకింత జాప్యం చోటుచేసుకుంది. అయినా పవన్ మధురై ప్రయాణం కోసం ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిందో, లేదంటే మురుగన్ మానాడు ఏర్పాటు చేసిందో, లేదంటే బీజేపీ ఏర్పాటు చేసిందో తెలియదు గానీ…వీవీఐపీలు ప్రయాణిం చేందుకు వినియోగించే ప్రత్యేక విమానంలో కూడా సాంకేతిక లోపాలు తలెత్తుతున్న తీరు నిజంగానే ఆందోళనకు గురి చేసేదేనని చెప్పక తప్పదు.