తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో బీఆర్ ఎస్ సర్కారు తీసుకున్న నిర్ణయానికి సీఎం రేవంత్ రెడ్డి పచ్చజెండా ఊపారు. రాజకీయ వైరుధ్యాలు, వైషమ్యాలు కేవలం రాజకీయాలకు మాత్రమే పరిమితం కావాలని ఆయన పేర్కొన్నారు. ప్రజలకు సంబంధించిన విషయంలో ఏ ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకున్నా.. దానిని కొనసాగిస్తామన్నారు. ఇప్పటికే బీఆర్ ఎస్ అమలు చేసిన పథకాలను తాము కొనసాగిస్తున్నట్టు పేర్కొన్న ఆయన.. తాజాగా అలాంటి పథకాన్నే రాష్ట్రంలో కొనసాగించాలని తెలిపారు.
బీఆర్ ఎస్ హయాంలో సామాజిక భద్రతా పింఛన్లను పెంచిన విషయంతెలిసిందే. ఇప్పుడు వాటినే రేవంత్ రెడ్డి కొనసాగిస్తున్నా రు. పైగా లబ్ధిదారులలో అనర్హులు ఉన్నారని పలువురు చెబుతున్నా.. వారిని తొలగించేందుకు ఇష్టపడడం లేదు. ఇదిలా వుంటే.. బీఆర్ ఎస్ ప్రభుత్వంకొన్ని మాసాల్లో అధికారం నుంచి దిగిపోతోందనగా.. ఓ కీలక నిర్ణయం తీసుకుంది. కిడ్నీ వ్యాధితో బాధపడుతూ.. డయాలిసిస్ చేయించుకుంటున్న రోగులను కూడా ప్రభుత్వం పక్షాన ఆదుకోవాలని నిర్ణయించింది. దీనికి సంబంధించి వరంగల్, ఆదిలాబాద్, కరీంనగర్‌ల నుంచి వచ్చిన అభ్యర్థనలను పరిశీలనలోకితీసుకుంది.
దీనికి సంబంధించి ఒక్కొక్క రోగికీ.. వైద్య సాయం ఇతర అవసరాలను దృష్టిలో పెట్టుకుని రూ.2016లను పింఛను రూపంలో అందించాలని నాటి సీఎం కేసీఆర్ నిర్ణయించారు. అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని దీనిపై కసరత్తు చేయాలని కూడా ఆదేశించారు. ఇది జరుగుతున్న సమయంలో అనూహ్యంగా ఆయన 2023లో ముందస్తు ఎన్నికలకు వెళ్లారు. ఎన్నికల ప్రచారంలో ఈ విషయాన్ని కూడా చెప్పారు. తాము అధికారంలోకి వస్తే.. డయాలిసిస్ రోగులకు నెల నెలా పింఛను ఇస్తామన్నారు. కానీ, కేసీఆర్ ఓడిపోయారు.
ఆ తర్వాత సీఎంగా బాధ్యతలు చేపట్టిన రేవంత్ రెడ్డికి కూడా.. పలు జిల్లాల నుంచి ఇదే విన్నపాలు వచ్చాయి. అయితే.. దీనిపై సుదీర్ఘ కసరత్తు చేసిన ఆయన.. గత సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయాన్నే కొనసాగించాలని భావించారు. వాస్తవానికి ఏపీలో డయాలిసిస్ రోగులకు రూ.10000 చొప్పున నెలనెలా పింఛనుగా ఇస్తున్నారు. దీనిలో సగమైనా ఇవ్వాలని తెలంగాణ మంత్రులు సూచించారు. కానీ, రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు ఇతర సమస్యలను దృష్టిలో పెట్టుకుని గతంలో కేసీఆర్ నిర్ణయించిన రూ.2016 ఇచ్చేందుకే సీఎం రేవంత్ రెడ్డి సిగ్నల్ ఇచ్చారు.
వచ్చే నెల లేదా.. ఆగస్టు నుంచి ఈ పింఛనును అందించనున్నారు. అయితే..రాజకీయాలకు అతీతంగా రోగులను ఆదుకోవడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. దీనిపై తాము ఎలాంటి కామెంట్లు చేయబోమని బీఆర్ ఎస్ నాయకులు కూడా వ్యాఖ్యానించారు. “క్రెడిట్ ఎవరికి అనేది కాదు.. రోగులకు మేలు జరిగితే చాలు“ అని బీఆర్ ఎస్ మాజీ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates