తెలంగాణలో శనివారం ఉదయం నుంచి బీఆర్ఎస్ యువ నేత, హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్టు ట్విస్టుల మీద ట్విస్టులు ఇస్తూ సాగింది. ఇక పాడికి రిమాండ్ ఖాయమని, ఆయనను ఖమ్మం జైలుకు తరలించేందుకు పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారంటూ దాదాపుగా అన్ని మీడియా సంస్థలూ వార్తలను ప్రసారం చేశాయి. అయితే శనివారం రాత్రి మరో భారీ ట్విస్టు చోటుచేసుకోగా… ఖాజీపేట రైల్వే కోర్టు కౌశిక్ రెడ్డికి షరతులతో కూడిన బెయిల్ ను మంజూరు చేసింది. దీంతో జైలుకు వెళతారని భావించిన పాడి ఎంచక్కా ఇంటికి తిరిగి వెళ్లిపోయారు.
రెండేళ్ల క్రితం క్వారీ యజమాని మనోజ్ రెడ్డిపై బెదిరింపులకు పాల్పడ్డారని పాడిపై కేసు నమోదు అయ్యింది. శనివారం ఉదయం ఆయన ఎక్కడికో వెళ్లేందుకు శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి వచ్చారు. ఈ విషయాన్ని పసిగట్టిన
పోలీసులు పాడి దేశం దాటి వెళ్లిపోతున్నారని ఆరోపిస్తూ ఆయనను అరెస్టు చేశారు. ఆ తర్వాత ఆయనను వరంగల్ తరలించిన పోలీసులు నగరంలోని ఎంజీఎం ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆ తర్వాత ఖాజీపేటలోని రైల్వే కోర్టులో ఆయనను హాజరుపరచగా… రిమాండ్ కు పంపమని పోలీసులు, బెయిల్ ఇవ్వాలని పాడి తరఫు న్యాయవాదులు ఎవరి వాదనలు వారు వినిపించారు.
ఈ సందర్భంగా వాదనలు సుదీర్ఘంగానే కొనసాగాయి. ఈ క్రమంలో పాడికి జైలు తప్పనిసరి అంటూ ఊహాగానాలు వెలువడ్డాయి. అయితే కౌశిక్ పై రాజకీయ ప్రేరేపితంగానే కేసు నమోదు అయ్యిందని, రెండేళ్ల క్రితం నమోదు అయిన కేసులో ఇప్పుడే అరెస్టు చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని, అయినా కేసు నమోదు చేసినప్పుడు ఉన్న సెక్షన్లను తాజాగా పోలీసులు మార్చారని ఆధారాలతో సహా పాడి తరఫు లాయర్లు వాదించారు. ఇరువర్గాల వాదనలను విన్న న్యాయమూర్తి కౌశిక్ రెడ్డికి షరతులతో కూడిన బెయిల్ ను మంజూరు చేశారు.
ఇక జైలు తప్పదని ఉదయం నుంచి ఓ భ్రమలో ఉండిపోయిన కౌశిక్ రెడ్డి… తనకు బెయిల్ లభించగానే కోర్టు నుంచి బయటకు వచ్చినంతనే ఓ రేంజిలో ఫైరయ్యారు. కాంగ్రెస్ సర్కారుపై తనదైన శైలిలో విరుచుకుపడ్డ పాడి… ఇప్పటిదాకా ఒక ఎత్తు, ఇకపై మరో ఎత్తు అంటూ హెచ్చరించారు. ఇకపై తాను ఏకే 47ను అవుతానన్న పాడి… ఆదివారం హైదరాబాద్ లో మీడియా ముందుకు వస్తానని… ఏ ఒక్కరూ ఊహించని ఆధారాలను బయటపెట్టి కాంగ్రెస్ ప్రభుత్వం భరతం పడతానని శపథం చేశారు. మరి ఆదివారం నాటి పాడి ప్రెస్ మీట్ ఏ రేంజిలో ఉంటుందోనన్న దిశగా ఆసక్తికర విశ్లేషణలు సాగుతున్నాయి.
Gulte Telugu Telugu Political and Movie News Updates