325 కోట్లు పంచేసిన వైసీపీ.. ఎందుకంటే!

గత 2024 ఎన్నికల్లో ప్రజలను తమవైపు తిప్పుకునేందుకు, ప్రజల ఓట్లను దక్కించుకునేందుకు వైసీపీ ఏకంగా 325 కోట్ల రూపాయలకుపైగా ఖర్చు చేసింది అని తాజాగా ఎడీఆర్ (అసోసియేషన్ ఫర్ డెమొక్రాటిక్ రిఫార్మ్స్) సంస్థ వెల్లడించడం సంచలనంగా మారింది.

వైసీపీ ఒక ప్రాంతీయ పార్టీ అనే విషయం తెలిసిందే. కానీ ఎన్నికల సమయంలో మాత్రం ఇది జాతీయ పార్టీలతో పోటీ పడుతూ నోట్ల వర్షం కురిపించిందని ఎడీఆర్ పేర్కొంది. జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ పార్టీల తర్వాతే వైసీపీ అధిక మొత్తంలో ఖర్చు చేయడం గమనార్హం.

గత ఎన్నికల్లో బీజేపీ దేశవ్యాప్తంగా అత్యధికంగా రూ. 1493 కోట్లు ఖర్చు చేసినట్టు ఎడీఆర్ పేర్కొంది. తర్వాత స్థానంలో కాంగ్రెస్ పార్టీ రూ. 620 కోట్లు ఖర్చు చేసింది. ఈ రెండు పార్టీల తర్వాత వైసీపీ రూ. 325 కోట్లతో మూడో స్థానంలో నిలిచింది.

ఈ మొత్తంలో అధిక భాగాన్ని ప్రజలకు నేరుగా పంపిణీ చేసినట్టు నివేదికలో తెలిపింది. మిగిలిన మొత్తాన్ని జగన్ ప్రచారం, ఇతర నిర్వహణ ఖర్చులకే వినియోగించారని వివరించారు. జాతీయ పార్టీ కాకపోయినా వైసీపీ ఈ స్థాయిలో ఖర్చు చేయడం ఆశ్చర్యంగా మారింది.

అదే సమయంలో, ప్రజలు అధికారం కట్టబెట్టిన టీడీపీ మాత్రం కేవలం రూ. 34.25 కోట్లు మాత్రమే ఖర్చు చేసినట్టు ఎడీఆర్ పేర్కొంది. ఇది బహిరంగ ప్రచారానికి వెచ్చించిన మొత్తం మాత్రమే. అభ్యర్థులు వ్యక్తిగతంగా ఖర్చు చేసిన రుసుములు పరిగణనలోకి తీసుకోలేదని సంస్థ వివరించింది. ఇక తెలంగాణకు చెందిన బీఆర్ఎస్ రూ. 109 కోట్లు ఖర్చు చేసినట్టు వెల్లడించింది.

ఇదిలా ఉంటే, వైసీపీ తిరిగి అధికారంలోకి రావడం కోసం 325 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే 2019లో టీడీపీ రూ. 142 కోట్లు ఖర్చు చేయగా, వైసీపీ రూ. 105 కోట్లు మాత్రమే ఖర్చు చేసింది. కానీ 2024కి వచ్చేసరికి వైసీపీ ఖర్చు మూడు రెట్లు పెరిగింది. ఇప్పుడు అసలు ప్రశ్న: ఈ సొమ్ము ఎక్కడినుంచి వచ్చింది? ఎవరు ఇచ్చారు? అనే విషయాలు ఇప్పటికీ తేలాల్సి ఉంది.