ఈ ఒక్క YCP MP పాస్ అయ్యాడు

వైసీపీ నాయ‌కులు అంటే ఒక విధ‌మైన ఏవ‌గింపు ప్ర‌జ‌ల్లో క‌నిపిస్తోంది. నోరు విప్పితే బూతులు.. ఎక్క‌డైనా మాట్లాడాల్సి వ‌స్తే.. మైకులు సైతం సిగ్గుప‌డేలా వారి మాట‌లు ఉంటాయ‌నే టాక్ త‌ర‌చుగా ప్ర‌త్య‌ర్థుల నుంచి వినిపిస్తుంది. అధికారంలో ఉండ‌గా.. న్యూడ్ వీడియోలు చేసిన ఎంపీ ఒకరైతే.. మంత్రులుగా ఉంటూ.. బొచ్చు-బొక‌డా అంటూ కామెంట్లు చేసిన వారు.. ఆడు-ఈడు అంటూ.. నోరు చేసుకున్న వారు ఉన్నారు. పోనీ.. ప్ర‌తిప‌క్షంలోకి వ‌చ్చినా ఏమైనా మార్పుందా? అంటే అది కూడా లేదు. ర‌ప్పా-ర‌ప్పా న‌రుకుతాం అంటే.. త‌ప్పేముంద‌ని అధినేతే చెప్పిన ప‌రిస్తితి క‌నిపించింది.

ఇక‌, గంజాయి బ్యాచ్‌కు, రౌడీ షీట‌ర్ల‌కు కూడా మ‌ద్ద‌తు ఇస్తూ.. వారి ఇళ్ల‌కు వెళ్లి ప‌రామ‌ర్శించ‌డం కూడా క‌నిపించింది. ఇలా.. ఒక్క విష‌యంలోనే కాదు.. స‌ర్వ‌కాల‌.. స‌ర్వ‌విధ‌.. స‌ర్వ వ్య‌వ‌స్థ‌ల్లోనూ నాయ‌కులు భ్ర‌ష్టు ప‌ట్టిపోయార‌న్న టాక్ వినిపిస్తున్న స‌మ‌యంలో ఒకే ఒక్క నాయ‌కుడు.. మ‌ట్టిలో మాణిక్యంలాగా మెర‌వ‌డం.. సంతోష‌మే అయినా.. దీనిపై అంద‌రూ విస్మ‌యం వ్య‌క్తం చేస్తున్నారు. ‘అలాంటి నాయ‌కుడు ఉన్న‌ది వైసీపీలోనా?’ అంటూ ఆశ్చ‌ర్యంతో ముఖాలు చిట్లిస్తున్నారు. గ‌త 20 రోజులుగా రాష్ట్రంలో ఏడాది పాల‌న‌.. అదేవిధంగా ఎంపీల ప‌నితీరుపై నాలుగు స‌ర్వేలు వ‌చ్చాయి. వీటిలో కేకే స‌ర్వే, రైజ్ వంటివి ప్ర‌ముఖంగా నిలిచాయి. మిగిలిన రెండు అంత పేరున్న‌వి కాక‌పోయినా.. వాటికి కూడా ప్రాధాన్యం ఉంది.

ఈ క్ర‌మంలో ఆయా స‌ర్వేలలో ప్ర‌జ‌లు వెల్ల‌డించిన అభిప్రాయాల మేర‌కు.. వైసీపీకి ఉన్న న‌లుగురు ఎంపీల్లో ఒకే ఒక్క‌రు ప్ర‌జానాయ‌కుడిగా నిలిచారు. ప్ర‌జాభిమానం చూర‌గొన్నారు. ‘మా మంచి ఎంపీ’ల జాబితాలోనూ.. ఆయ‌న పేరు సంపాయించుకున్నా రు. ఆయ‌నే తిరుప‌తి ఎంపీ మ‌ద్దిల గురుమూర్తి. 2021లో రాజ‌కీయ రంగ ప్ర‌వేశం చేసిన ఫిజియోథెర‌పిస్టు గురుమూర్తి. జ‌గ‌న్ పాద‌యాత్ర చేసిన‌ప్పుడు ఆయ‌న‌కు వ్య‌క్తిగ‌త వైద్యుడిగా ఉన్నారు. ఈ క్ర‌మంలోనే 2021లో జ‌రిగిన తిరుప‌తి పార్ల‌మెంటు ఉప ఎన్నిక‌ల‌లో పోటీ చేసి విజ‌యంద‌క్కించుకున్నారు. సౌమ్యుడిగా పేరు తెచ్చుకున్నారు.

గ‌త ఏడాది వైసీపీ తుడిచి పెట్టుకుపోయినా.. ముఖ్యంగా బ‌ల‌మైన టీడీపీ కంచుకోట‌గా ఉన్న చిత్తూరులో ఎంపీ గురుమూర్తి విజ‌యం ద‌క్కించుకున్నారు. తిరుప‌తి పార్ల‌మెంటు ప‌రిధిలో ఏడు అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాలు ఉంటే.. వాటిలో ఒక్క‌టి కూడా వైసీపీకి ద‌క్క‌లేదు.కానీ, ఎంపీగా మాత్రం గురుమూర్తి విజ‌యం ద‌క్కించుకున్నారు. తాజాగా వెల్ల‌డించిన ప‌లు స‌ర్వే సంస్థ‌ల జాబితాల‌లో మంచి ఎంపీగా, ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లను ప‌ట్టించుకునే ఎంపీగా, ప్ర‌జ‌ల‌కు చేరువ‌గా ఉండే ఎంపీగా గురు మూర్తి పేరు తెచ్చుకోవ‌డం గ‌మ‌నార్హం. అందుకే.. ‘వైసీపీలో ఇలాంటి ఎంపీనా?’ అంటూ రాజ‌కీయ నాయ‌కులు పెద‌వి విరుస్తున్నారు. స్థానికంగా కూడా.. ప్ర‌త్య‌ర్థులు విమ‌ర్శించ‌ని నాయ‌కుడు ఈయ‌నే కావ‌డం గ‌మ‌నార్హం.