బీఆర్ ఎస్ నాయకుడు, హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. ఓ క్వారీ యజమానిని బెదిరించిన కేసులో ఆయనను శనివారం ఉదయం వరంగల్ జిల్లా సుబేదారి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శంషాబాద్ విమానాశ్రయం నుంచి వేరే ప్రాంతానికి వెళ్లేందుకు ప్రయత్నించిన సమయంలో పాడిని పోలీసులు అరెస్టు చేయడం గమనార్హం. క్వారీ యజమాని మనోజ్‌కుమార్ నుంచి రూ.50 లక్షలు కౌశిక్‌రెడ్డి డిమాండ్ చేశారనే ఆరోపణలు వున్నాయి.
దీనిపై పోలీసులు కొన్నాళ్ల కిందటే కేసు నమోదు చేశారు. అయితే..ఈ కేసును కొట్టివేయాలని.. ఇది రాజకీయ ప్రేరేపిత కేసు అని పేర్కొంటూ.. కౌశిక్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. అయితే.. అక్కడ ఆయనకు ఉపశమనం లభించలేదు. పైగా.. ఇలాంటి కేసుల్లో తీవ్రంగా పరిగణించాల్సి ఉంటుందనికూడా కోర్టు వ్యాఖ్యానించింది. ఇది జరిగిన రెండు రోజుల తర్వాత.. కౌశిక్ రెడ్డిని శనివారం ఉదయం హనుమకొండలో పోలీసులు అరెస్టు చేయడం గమనార్హం.
ఆయనపై బీఎన్ ఎస్ సెక్షన్ 308(2), 350(1) కింద కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. అయితే.. ఈ సమయంలో పోలీసులకు, కౌశిక్ రెడ్డికి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. తనను ఎందుకు అరెస్టు చేస్తున్నారో చెప్పాలంటూ పోలీసులను ఆయన గద్దించారు. దీంతో అరెస్టు వారెంటుతో పాటు.. కేసుకు సంబంధించిన కాపీని కూడా పోలీసులు ఆయనకు అందించారు. అక్కడి నుంచి వరంగల్‌కు ప్రత్యేక కాన్వాయ్‌లో కౌశిక్‌ను తరలించారు.
ఇక, కౌశిక్ రెడ్డి అరెస్టు పై బీఆర్ ఎస్ కీలక నాయకుడు కేటీఆర్, హరీష్‌రావులు నిప్పులు చెరిగారు. ప్రభుత్వాన్ని విమర్శించిన వారిపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని దుయ్యబట్టారు. ఏం నేరం చేశాడని కౌశిక్ రెడ్డిని అరెస్టు చేశారని ప్రశ్నించారు. రాజకీయ కక్షసాధింపు చర్యల్లో భాగంగానే కౌశిక్ రెడ్డిని అరెస్టు చేశారని.. ఈ విషయాన్ని కోర్టుల్లోనే తేల్చుకుంటామని కేటీఆర్ వ్యాఖ్యానించారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates