“ప్రపంచ దేశాలను ఏపీ చూడడం కాదు.. ఏపీని ప్రపంచ దేశాలు చూసేలా చేశారు. మీ కర్తవ్య నిష్ఠకు ఇదే ఉదాహరణ” అని ప్రధాని నరేంద్ర మోడీ సీఎం చంద్రబాబును ప్రశంసలతో ముంచెత్తారు. శనివారం(జూన్ 21) అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ విశాఖపట్నానికి వచ్చారు. శుక్రవారం రాత్రికి ఒడిశా రాజధాని భువనేశ్వర్ నుంచి విశాఖకు ప్రత్యేక విమానంలో చేరుకున్న ఆయనకు సీఎం చంద్రబాబు, గవర్నర్ అబ్దుల్ నజీర్, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్‌ల నుంచి ఘన స్వాగతం లభించింది.
అనంతరం.. సమీపంలోని ఓ హోటల్‌కు చేరుకున్న ప్రధాని కొద్ది సేపు అక్కడ సీఎం చంద్రబాబుతో ఏకాంతంగా చర్చించారు. ఈ సమయంలో విశాఖలో అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహణకు చేసిన ఏర్పాట్లకు సంబంధించిన ఫొటోలను సీఎం చంద్రబాబు ఆయనకు చూపించారు. వీటిని తిలకించిన ప్రధాని.. అద్భుతంగా చేశారని.. కనీ వినీ ఎరుగని రీతిలో ఉన్నాయని వ్యాఖ్యానించారు. తాను ఇంత బాగా చేస్తారని ఊహించలేదన్నారు. కర్తవ్య నిష్ఠకు మీరే ఉదాహరణ ఈ సందర్భంగా ప్రధాని ప్రశంసలు గుప్పించారు.
యోగాంధ్ర నిర్వహణపై ఏర్పాట్లపై సీఎం చంద్రబాబు వివరించారు. నెల రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా యోగా కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈ విషయం తనకు కూడా తెలిసిందని.. ప్రధాని వ్యాఖ్యానించారు. యోగాను నేను ప్రపంచానికి పరిచయం చేస్తే.. ఆ ప్రపంచం మొత్తాన్ని మీరు ఏపీవైపు చూసేలా చేశారు అని ప్రధాని మోడీ వ్యాఖ్యానించారు. ఏపీలోని మంత్రులు, నాయకుల పనితీరు కూడా చాలా చాలా బాగుందని కితాబునిచ్చారు. అనంతరం విశాఖ ఎయిర్‌పోర్టు నుంచి ఐఎన్‌ఎస్ డేగాకు చేరుకుని, అక్కడ నుంచి నౌకాదళ అతిథిగృహానికి ప్రధాని వెళ్లిపోయారు.
శనివారం ఉదయం 6.30 గంటలకు విశాఖలోని ఆర్కే బీచ్‌లో ప్రారంభమయ్యే అంతర్జాతీయ యోగాలో ఆయన పాల్గొని యోగాసనాలు వేయనున్నారు. కాగా.. శుక్రవారం రాత్రికి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, గవర్నర్ అబ్దుల్ నజీర్ సహా.. మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ విశాఖలోనే ఉండి.. శనివారం నాటి కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఈ యోగా ద్వారా గిన్నీస్ రికార్డు సృష్టించాలని సీఎం చంద్రబాబు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఒకే దఫా 5 లక్షల మందితో యోగాసనాలు వేయించేలా కార్యాచరణను సిద్ధం చేసుకున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates