ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు నదుల అనుసంధానంలో భాగంగా పోలవరం- బనకచర్ల ప్రాజెక్టును అత్యంత ప్రతిష్ఠాత్మకంగా పరిగణిస్తున్నారు. రాజధాని అమరావతికి వచ్చినంత ప్రయారిటీని బాబు ఈ ప్రాజెక్టుకు ఇస్తున్నారు.. ఇప్పుడున్న పరిస్థితుల్లో కేంద్రం నుంచి అనుమతులు చాలా ఈజీనే. అయితే మరో తెలుగు రాష్ట్రం తెలంగాణ నుంచే ఈ ప్రాజెక్టుపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి నేపథ్యంలో శుక్రవారం ఢిల్లీ నుంచి హైదరాబాద్ చేరిన తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుములత రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రాజెక్టుకు ఇక రాచబాట పరిచినట్టేనని చెప్పక తప్పదు.
బానకచర్ల ప్రాజెక్టుపై తెలంగాణతో చర్చలకు తాము సిద్ధమని ఇప్పటికే చంద్రబాబు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఏపీ వల్ల తెలంగాణ నష్టపోవడం తనకు ఇష్టం లేదన్న చంద్రబాబు… రాయలసీమను రతనాల సీమగా మార్చే బనకచర్లకు ఏ రీతిన అనుమతులు సాధించాలన్న విషయంపై తెలంగాణతో ఎలాంటి చర్చలకు అయినా తాను సిద్ధమేనని గురువారం ఆయన ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే అంతకుముందు రోజు బుధవారం రేవంత్ రెడ్డి ఈ ప్రాజెక్టుపై ఒకింత ఘాటు వ్యాఖ్యలు చేశారు. తమను కాదని కేంద్రం నుంచి అనుమతులు తీసుకుని ప్రాజెక్టును మొదలుపెడితే… సుప్రీంకోర్టుకు అయినా వెళతామంటూ ఏపీని హెచ్చరించారు. అయినా బీజేేపీతో ఉన్న బంధంతో ఏపీ సర్కారు ఈజీగానే అనుమతులు పొందవచ్చని… అయితే తాము మాత్రం వాటిని అడ్డుకుని తీరతామని ఆయన పేర్కొన్నారు.
తాజాగా డిల్లీలో బనకచర్ల ప్రాజెక్టుపై కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ తో భేటీ అయిన రేవంత్ శుక్రవారం హైదరాబాద్ తిరిగి వచ్చారు. ఈ సందర్బంగా ఆయన బనకచర్లకు సంబంధించి తెలంగాణపై బాబు ఎలాంటి వ్యాఖ్యలు చేశారో… రేవంత్ కూడా ఇదే ప్రాజెక్టుపై ఏపీ పట్ల అదే వైఖరిని ప్రదర్శించారు. కేంద్రంతో సంప్రదింపుల తర్వాత ఈ నెల 23న కేబినెట్ సమావేశాన్ని నిర్వహిస్తున్నామన్న రేవంత్ ఆ తర్వాత ఏపీని చర్చలకు ఆహ్వానిస్తామని తెలిపారు. అవసరం అయితే ఏపీ సీఎం బాబును తానే స్వయంగా ఆహ్వానిస్తానని కూడా రేవంత్ చెప్పారు. నీటి పంపకాల్లో పొరుగు రాష్ట్రాలతో తాము వివాదాలు కోరుకోవడం లేదన్న రేవంత్… పరిష్కారాలు మాత్రమే ఆశిస్తున్నామని తెలిపారు. ఈ విషయంలో ఎన్ని విమర్శలు వచ్చినా వెనుదిరిగేది లేదని చెప్పారు.
బనకచర్లపై వివాదాన్ని పరిష్కరించుకునేందుకు ఏపీతో నాలుగు సార్లు, నాలుగు రోజులు వరుసగా భేటీలకూ తాను సిద్ధమేనని కూడా రేవంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా బాబు తీరుపై రేవంత్ ఒకింత అసంతృప్తిని వ్యక్తం చేశారు. పొరుగు రాష్ట్రం అయిన తమను సంప్రదించకుండానే చంద్రబాబు బనకచర్లపై నేరుగా కేంద్రాన్ని సంప్రదించారని అన్నారు. అలా కాకుండా ముందుగా తెలంగాణతోనే బాబు బనకచర్లపై చర్చించి ఉంటే… అసలు వివాదమే వచ్చి ఉండేది కాదని కూడా రేవంత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మొత్తంగా బనకచర్లపై ఏపీతో చర్చలకు తాము సంసిద్ధంగా ఉన్నామని ప్రకటించిన రేవంత్… బనకచర్లకు అనుమతుల విషయంపై నెలకొన్న సందిగ్ధతకు చెక్ పెట్టేశారని చెప్పాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates