నిజమే… తంగిరాల సౌమ్య అనుకోకుండానే… ఇంకా చెప్పాలంటే తన ప్రమేయం లేకుండానే రాజకీయాల్లోకి వచ్చేశారు. అయితేనేం తాను అనుకున్న లక్ష్యాన్ని మాత్రం ఆమె మరిచిపోలేదు. ఇప్పటికే రెండు దఫాలుగా ఎమ్మెల్యేగా గెలిచి ప్రజా సేవలో మునిగితేలుతూనే… తన లక్ష్యమైన న్యాయవాద విద్యను అభ్యసించేందుకు మార్గం సుగమం చేసుకున్నారు. అంతేనా.. ఏదో రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థి కదా… ఏదో అలా లాసెట్ రాస్తే ఇలా సీటు వచ్చేసిందని చెప్పడానికి కూడా లేదు. ఎందుకంటే గురువారం విడుదలైన ఏపీ లాసెట్ లో సౌమ్య ఏకంగా 739 ర్యాంకును సాదించారు.
ఎన్టీఆర్ జిల్లా నందిగామ ఎమ్మెల్యేగా సౌమ్య కొనసాగుతున్నారు. 2014లో ఆమె తండ్రి తంగిరాల ప్రభాకర్ రావు టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచి..నెలల వ్యవధిలో చనిపోయారు. దీంతో అప్పటికి ఇంకా పెళ్ల కూడా కాని సౌమ్య అనివార్యంగా రాజకీయాల్లోకి వచ్చారు. టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆమెను ప్రోత్సహించారు. వెన్ను తట్టారు. తామంతా ఉన్నామని, అధైర్యపడాల్సిన పని లేదని భరోసా ఇచ్చారు. బాబు భరోసాతో బరిలోకి దిగిన సౌమ్య ఉప ఎన్నికల్లో రికార్డు మెజారిటీతో విజయం సాధించి ప్రజా సేవలో నిమగ్నమయ్యారు.
2019 ఎన్నికల్లో వైసీపీ వైపు వీచిన గాలిలో ఇతర టీడీపీ నేతల మాదిరే సౌమ్య కూడా ఓటమిపాలయ్యారు. అయినా కూడా ఏమాత్రం వెనుకంజ వేయని సౌమ్య టీడీపీని అంటిపెట్టుకునే సాగారు. పార్టీ తరఫున పోరాటం చేశారు. ఫలితంగా 2024 ఎన్నికల్లోనూ మరోమారు ఆమె నందిగామ నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగి తనను ఎవరైతే ఓడించారో, ఆ నేతనే డబుల్ మెజారిటీతో విజయం సాధించారు. పెద్దగా వివాదాల జోలికి వెళ్లని సౌమ్య.. తప పని ఏదో తాను చేసుకుపోతూ ఉంటారన్న పేరుంది. అవినీతి మరకలు అసలే లేవనే చెప్పాలి.
ఇక తండ్రి ఆకస్మక మరణంతో ఉన్నపళంగా చదువు ఆపేసి రాజకీయాల్లోకి వచ్చిన సౌమ్య… ఎన్నాళ్లుగానో తనలో ఉన్న లా కోర్సును ఇప్పుడైనా పూర్తి చేయాలని తలచారు. ఈ క్రమంలో సింపుల్ గా ఏపీ లాసెట్ కు దరఖాస్తు చేసుకున్న ఆమె… ఎమ్మెల్యే అనే డాబూ దర్పాన్ని పక్కనపెట్టి.. ఇతర అభ్యర్థుల మాదిరే వెళ్లి లాసెట్ ఎంట్రెన్స్ ఎగ్జామ్ రాశారు. మంచి ర్యాంకు సాధించారు. ఇప్పుడు ఆమె సంతోషానికి అవధులే లేవని చెప్పాలి. అంటే… మరికొన్నాళ్లకు టీడీపీ ఎమ్మెల్యే తంగిరాల సౌమయ్య ఓ లాయర్ గానూ కొత్త బాధ్యతల్లోకి ఒరిగిపోతారన్న మాట.
Gulte Telugu Telugu Political and Movie News Updates