వైసీపీ కీలక నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ గురువారం రాత్రి మరోమారు విజయవాడ జైలు నుంచి నగరంలోని ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లారు. జైలు అదికారులే ఆయనను ఆసుపత్రికి తరలించారు. వివిధ కేసులతో 3 నెలల క్రితమే అరెస్టైన వంశీ… జైలులో పలుమార్లు అనారోగ్యానికి గురయ్యారు. ఈ క్రమంలో ఇటీవలే సమగ్ర వైద్య పరీక్షల కోసం ఆయనకు కోర్టు మధ్యంతర బెయిల్ కూడా సమర్పించింది. తాజాగా గురువారం డీహైడ్రేషన్ తో పాటు వాంతులు, విరేచనాలతో బాధపడుతున్న వంశీని ఆసుపత్రికి తరలించారు.
వైసీపీ అధికారంలో ఉండగా… గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి జరిగిన కేసులో వంశీ నిందితుడిగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఈ కేసును ఎలాగైనా మాఫీ చేయించుకోవాలన్న ప్లాన్ వేసిన వంశీ… పోలీసులకు ఫిర్యాదు చేసిన దళిత యువకుడు సత్యవర్ధన్ ను కిడ్నాప్ చేశారు. ఈ క్రమంలో సత్యవర్ధన్ కుటుంబం పోలీసులను ఆశ్రయించగా… కేసు నమోదు చేసుకున్న పోలీసులు దానిపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేశారు. సత్యవర్ధన్ ను వంశీ తన అనుచరులతో కిడ్నాప్ చేయించారని నిర్ధారించుకుని వంశీని అరెస్టు చేశారు.
ఈ కేసులో వంశీకి కోర్టు రిమాండ్ విధించగా… పోలీసులు ఆ తర్వాత గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి, నకిలీ పట్టాల పంపిణీ, భూకబ్జా తదితర కేసులు కూడా వరుసగా నమోదు చేశారు. ఈ కేసుల్లోనూ వంశీకి కోర్టు రిమాండ్ విధించగా… ఓ కేసులో బెయిల్ లభించినా.. మరో కేసు రిమాండ్ నేపథ్యంలో రోజుల తరబడి ఆయన జైల్లోనే కాలం వెళ్లదీయాల్సిన పరిస్థితి నెలకొంది. జైలుకు వచ్చే నాటికే పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వంశీ… జైలుకు వచ్చాక ఆ సమస్యలతో మరింతగా ఇబ్బంది పడ్డారు. ముఖం గుర్తు పట్టలేనంతగా ఆయన మారిపోయారు. తాజాగా ఆయన మరోమారు తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో అధికారులు ఆయనను జైలుకు తరలించారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates