వైసీపీ అధినేత జగన్ తాజాగా మీడియాతో మాట్లాడారు. సుమారు 40 నిమిషాల పాటు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బుధవారం గుంటూరు జిల్లా రెంటపాళ్లలో జరిగిన ఘటనలను వివరించారు. రాష్ట్రంలో తాము.. అధికార పార్టీ టీడీపీ, దానిని సమర్థించే ఎల్లో మీడియాతో యుద్ధం చేస్తున్నామని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు దిగజారాయనడానికి బుధవారం నాటి రెంటపాళ్ల పర్యటనే ఉదాహరణ అని పేర్కొన్నారు. వైసీపీ కార్యకర్తలను పరామర్శించినా.. ఓర్చుకోలేని స్థితిలో కూటమి ప్రభుత్వం ఉందన్నారు.
రెంటపాళ్లలో కర్ఫ్యూలాంటి పరిస్థితిని కల్పించి.. వైసీపీని నాయకులను ఇబ్బందులకు గురి చేశారని జగన్ చెప్పారు. అయినా.. పార్టీ నాయకులు, కార్యకర్తలు మొక్కవోని దీక్షతో ముందుకు కదిలారని చెప్పారు. “మా పార్టీ శ్రేణుల్ని పరామర్శిస్తే తప్పా?” అని ప్రభుత్వాన్ని జగన్ ప్రశ్నించారు. తమ పర్యటనలకు చంద్రబాబు భయపడుతున్నారని జగన్ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ప్రతిపక్షం లేకుండా చేయాలన్న వ్యూహంతో ఆయన ముందుకు సాగుతున్నారని తెలిపారు.
ఈ విషయంలో ఇటీవల కొన్ని టీవీల్లోనే చంద్రబాబు చెప్పుకొచ్చారని జగన్ వ్యాఖ్యానించారు. “ఇవి అహంకారంతో చేసిన వ్యాఖ్యలు కాదా? ప్రతిపక్ష పార్టీని భూస్థాపితం చేస్తాడట. ప్రశ్నిస్తున్న వ్యక్తిని భూస్థాపితం చేస్తారా?” అని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత పెరిగిందని.. అందుకే.. ప్రజల ఆగ్రహన్ని డైవర్ట్ చేసేందుకు తమ పర్యటనలకు ఆంక్షలు విధిస్తున్నారని.. ప్రజలకు తప్పుడు సంకేతాలు ఇస్తున్నారని జగన్ దుయ్యబట్టారు.
ఎన్ని చేసినా తమ పోరాటం ఆగబోదని జగన్ చెప్పారు. ఎంతగా తమపై ఒత్తిడి తెస్తే.. అంతగా తాము ప్రజల మధ్యకు వెళ్తామని, వారి సమస్యలు వింటామని చెప్పుకొచ్చారు. ప్రజలకు వైసీపీతో ఉన్న అనుబంధం చెదరగొట్టాలని ప్రయత్నిస్తే.. అంతకన్నా పెద్ద తప్పు మరొకటి ఉండదని అన్నారు. చంద్రబాబు తీరు మార్చుకోకపోతే.. భవిష్యత్తులో గట్టిగా బుద్ధి చెబుతామని హెచ్చరించారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates