వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం తాడేపల్లిలోని తన పార్టీ కేంద్ర కార్యాలయంలో సుదీర్ఘంగా మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎప్పటిలానే కూటమి పాలన కంటే తన పాలనే మెరుగ్గా ఉందని ఆయన చెప్పుకొచ్చారు. మొత్తానికే మొత్తం అన్నీ పాత విషయాలే మాట్లాడిన జగన్… చివరలో మాత్రం కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బుధవారం నాటి రెంటపాళ్ల పర్యటనలో వైసీపీ కార్యకర్త ఒకరు రెచ్చగొట్టే ఓ ప్లకార్డును పట్టుకున్న విషయాన్ని ప్రస్తావించిన మీడియా… దానిపై పోలీసులు ఆగ్రహంగా ఉన్నారని చెప్పారు. దీనిపై మీ స్పందన ఏమిటని ప్రశ్నించింది.
మీడియా ప్రశ్నలకు ఒకింత సహనంతోనే సమాధానాలు ఇచ్చిన జగన్… సదరు ప్లకార్డులో ఏముందని ప్రశ్నించారు. ‘గంగమ్మ జాతరలో పొట్టేళ్ల తలలు నరికినట్టు రప్పా రప్పా నరుకుతా’ అంటూ ఆ ప్లకార్డుపై ఉందని మీడియా ప్రతినిధి చెప్పగానే… ఇదేదో సినిమా డైలాగ్ మాదిరిగా ఉందే అంటూ జగన్ అన్నారు. ఆ సినిమా ఏది అంటూ ప్రశ్నించిన ఆయన పుష్ప 2 సినిమా అనే ఆన్సర్ రాగానే.. అంటే సినిమా డైలాగులు వాడితే కూడా కేసులు పెడతారా? అంటూ జగన్ వ్యంగ్యాస్త్రాలు సందించారు. ఈ సందర్భంగానే పుష్ప సినిమాలో అల్లు అర్జున్ అన్నట్లుగా తన చేతులతో ‘గడ్డం ఇట్టన్నా తప్పే, గడ్డం అట్టన్నా తప్పేనా?’ అంటూ జగన్ తనదైన శైలి వ్యాఖ్యలు చేశారు.
అయినా మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా? అంటూ జగన్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఆ తర్వాత సదరు ప్లకార్డు పట్టిన కార్యకర్త టీడీపీకి చెందిన వారని, ఆయనకు ఏకంగా టీడీపీ సభ్యత్వం కూడా ఉందని ఓ మీడియా ప్రతినిధి ఏకంగా ఫొటోనే జగన్ కు చూపించారు. అయితే ఇదంతా చంద్రబాబే చేయించారా? అంటూ ఆయన హాస్యమాడారు. ఇక ఆ టీడీపీ కార్యకర్త నిరసనలోనూ న్యాయముందిలే అంటూ చెప్పిన జగన్.. చంద్రబాబు ఇచ్చిన హామీలు అమలు కాకపోవడంతో ఆ కార్యకర్త టీడీపీని వీడి వైసీపీలో చేరి ఉంటాడులే అంటూ ముక్తాయింపునిచ్చారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates