‘రప్పా రప్పా..’ అరెస్ట్ అయిపోయాడు

ఓవైపు పోలీసులు అనుమతులు లేదంటున్నా.. ఆంక్షలు పెట్టినా.. అవేమీ పట్టించుకోకుండా బుధవారం పల్నాడు పర్యటన చేశారు మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత. ఈ సందర్భంగా ఆ పార్టీ కార్యకర్తలు చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. పోలీసులు వారిస్తున్నా వినకుండా.. బారికేడ్లను తోసుకుంటూ వేలమంది ర్యాలీలు చేశారు. జగన్ నినాదాలతో ఊగిపోయారు. కాగా ఈ ర్యాలీలో కొందరు వైసీపీ కార్యకర్తలు పట్టుకున్న ప్లకార్డుల గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద రచ్చే జరుగుతోంది. దారుణమైన భాషలో ప్రత్యర్థి పార్టీలకు వార్నింగ్ ఇస్తున్నట్లుగా ఉన్న ఈ ప్లకార్డులు చూసి అందరూ అవాక్కవుతున్నారు.

వాటిలో మచ్చుకు కొన్ని…
“కొట్టారు తీసుకున్నాం.. మా టైం వస్తుంది.. కు.. చెక్కేస్తాం.
“రాజారెడ్డి రాజ్యాంగం పల్నాడు నుంచి మొదలు”
“2029లో వైఎస్సార్సీపీ వచ్చిన వెంటనే గంగమ్మతల్లి జాతరలో వేట తలలు నరికినట్లు రప్పా రప్పా నరుకకుతాం ఒక్కొక్కడిని”
“రప్పా రప్పా నరుకకుతాం నా కొడకల్లారా”
“ఎవడైనా రానీ తొక్కి పడేస్తాం”
“అన్న వస్తాడు అంతు చూస్తాడు”

వైసీపీ అధికారం కోల్పోయి ఏడాది మాత్రమే అవుతుండగా.. అప్పుడే మళ్లీ అధికారంలోకి వచ్చి ప్రత్యర్థుల అంతు చూస్తామంటూ ఇలా వార్నింగ్స్ ఇవ్వడం వైసీపీ కార్యకర్తల మైండ్ సెట్ ఎలాంటిదో చెప్పడానికి నిదర్శనం అని.. ఇలా బహిరంగంగా చంపుతాం, నరుకుతాం అంటున్న వాళ్లను పోలీసులు ఏమీ చేయరా అంటూ సోషల్ మీడియా జనాలు ప్రశ్నిస్తున్నారు. ఇలా ప్లకార్డులు పట్టుకున్న వాళ్ల వివరాలను కూడా టీడీపీ, జనసేన కార్యకర్తలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే రవితేజ అనే వ్యక్తిని వైజాగ్ పోలీసులు అరెస్ట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ‘పుష్ప-2’ సినిమా డైలాగ్‌ను గుర్తు చేస్తూ “రప్పా రప్పా నరుకుతాం ఒక్కొక్కడిని” అనే ప్లకార్డు పట్టుకుంది అతనే.