చెవిరెడ్డి వాదనలు చెల్లలేదు.. 1 వరకు జైలు

ఏపీలో తీవ్ర కలకలం రేపుతున్న మద్యం కుంభకోణం కేసులో వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు, ఆ పార్టీ కీలక నేత, చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డికి జ్యూడిషియల్ రిమాండ్ విధిస్తూ బెజవాడ ఏసీబీ కోర్టు బుధవారం రాత్రి ఉత్వర్లులు జారీ చేసింది. దీంతో చెవిరెడ్డిని సిట్ అధికారులు మరికాసేపట్లో బెజవాడలోని జిల్లా జైలుకు తరలించనున్నారు. చెవిరెడ్డితో పాటుగా ఆయన బాల్య స్నేహితుడు వెంకటేశ్ నాయుడినీ కోర్టు జైలుకు పంపింది.

బెంగళూరు ఎయిర్ పోర్టు నుంచి గుట్టు చప్పుడు కాకుండా శ్రీలంక చెక్కేసేందుకు ప్లాన్ వేసిన చెవిరెడ్డి… వెంకటేశ్ నాయుడితో కలిసి మరీ వెళ్లారు. అయితే అప్పటికే చెవిరెడ్డిపై లుకౌట్ నోటీసులు జారీ అయి ఉండటంతో అక్కడి ఇమ్మిగ్రేషన్ అధికారులు చెవిరెడ్డిని నిలిపివేశారు. అనంతరం సిట్ అధికారులకు సమాచారం చేరవేసిన ఇమ్మిగ్రేషన్ అధికారులు… సిట్ అధికారులు బెంగళూరు చేరేదాకా చెవిరెడ్డిని తమ అదుపులోనే ఉంచుకున్నారు. మంగళవారం రాత్రికి అక్కడికి చేరుకున్న సిట్ అధికారులు చెవిరెడ్డిని అరెస్టు చేస్తున్నట్లు ప్రకటించి విజయవాడ తరలించారు.

బుధవారం ఉదయం నుంచి సాయంత్రం దాకా చెవిరెడ్డి, వెంకటేశ్ నాయుడులను ప్రశ్నించిన సిట్ అదికారులు. సాయంత్రం ట్రయల్ కోర్టు అయిన ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా స్వతహాగా న్యాయవాది అయిన చెవిరెడ్డి తన కేసును తానే వాదించుకున్నట్లు సమాచారం. తన మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండానే సిట్ అధికారులు ఎలా లుకౌట్ నోటీసులు జారీ చేస్తారని ప్రశ్నించారు. అంతేకాకుండా రిమాండ్ రిపోర్టులో తాను చెప్పని విషయాలను కూడా సిట్ నమోదు చేసిందని జడ్జికి చెప్పారు. అంతటితో ఆగని ఆయన ఏకంగా 26 ప్రశ్నలకు తాను చెప్పిన సమాధానాలు కాకుండా సిట్ కు అనుకూలంగా ఉన్న ఆన్సర్లను రాసుకున్నారని తెలిపారు.

ఇక ఇదే కేసులో విచారణకు ఎప్పుడు పిలిచినా వస్తానని, తనను అకారణంగా ఈ కేసులో ఇరికిస్తున్నారని మీడియా ముందు ఆరోపించిన చెవిరెడ్డి… గుట్టు చప్పుడు కాకుండా దేశం దాటి పారిపోయేందుకు యత్నించారని సిట్ పోలీసులు కోర్టుకు తెలిపారు. అంతేకాకుండా మద్యం ముడుపుల్లో చెవిరెడ్డి రూ.200 నుంచి రూ.250 కోట్లను వాడారని, ఈ మొత్తాన్ని ఆయన ఎన్నికల్లో ఖర్చు పెట్టారని తెలిపారు. ఇరు పక్షాల వాదనలు విన్న  కోర్టు.. సిట్ వాదనలతో ఏకీభవించి చెవిరెడ్డి, వెంకటేశ్ లకు జూలై 1 దాకా రిమాండ్ విధించింది.