బనకచర్లకు 2019లోనే అంకురార్పణ: రేవంత్ రెడ్డి

ఏపీ ప్రతిపాదిస్తున్న పోలవరం- బనకచర్ల ప్రాజెక్టుకు 2019లోనే అంకురార్పణ జరిగిందని తెలంగాణ సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి అన్నారు. ఈ మేరకు బుధవారం సచివాలయంలో నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో భాగంగా బనకచర్లపై కీలక చర్చ జరిగింది. ఏపీ ప్రతిపాదిస్తున్న బనకచర్ల ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని అఖిలపక్ష సమావేశానికి వివరించిన రేవంత్… తెలంగాణకు తీరని నష్టం చేకూర్చే ఈ ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ కేంద్రానికి తీర్మానం పంపుదామన్నారు. అందుకోసం అన్ని పార్టీలు కలిసి రావాలని కూడా రేవంత్ పిలుపునిచ్చారు. 

అసలు గోదావరి నీరు 3 వేల టీఎంసీల దాకా సముద్రంలో వృథాగా కలుస్తోందన్న విషయాన్ని బీఆర్ఎస్ అధినేత, నాటి తెలంగాణ సీఎం హోదాలో కల్వకుంట్ల చంద్రశేఖరరావే ప్రస్తావించారని రేవంత్ గుర్తు చేశారు. కేసీఆర్ ఈ విషయాన్ని బయటపెట్టడంతోనే ఏపీ బనకచర్లకు ప్రణాళికలు రచించిందని ఆయన అన్నారు. నాడు కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన అపెక్స్ కౌన్సిల్ సమావేశంలోనే కేసీఆర్ ఈ విషయాన్ని వెల్లడించారని కూడా రేవంత్ అన్నారు. ఈ లెక్కన బనకచర్ల ప్రాజెక్టు రూపకల్పనకు కేసీఆరే తొలి అడుగు వేశారని చెప్పక తప్పదని ఆయన ఆరోపించారు.

నాటి అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో కేసీఆర్ ఏం మాట్లాడారు?, ఏపీ ప్రతినిధులు ఏం మాట్లాడారు? కేంద్రం ప్రతినిధులు ఏం మాట్లాడారన్న విషయాలన్నీ రికార్డుల రూపంలో ఇప్పటికీ భద్రంగానే ఉన్నాయని రేవంత్ అన్నారు. వృథాగా పోతున్న జలాలను ఏపీకి గుర్తు చేయడంతో పాటుగా ఆ రాష్ట్రం బనకచర్లకు ప్రణాళికలు సిద్ధం చేసుకోవడానికి పరోక్షంగా కేసీఆరే కారణమని కూడా రేవంత్ ఆరోపించారు. ఇక 2019లో గోదావరి జలాలను రాయలసీమకు తరలించే విషయంపై నాటి ఏపీ సీఎం జగన్ తో కేసీఆర్ పలుమార్లు చర్చలు జరిపారని కూడా ఆయన ఆరోపించారు.

ఇక అఖిలపక్ష సమావేశంలో భాగంగా బనకచర్లపై కేసీఆర్ తెలంగాణ అసెంబ్లీలో చేసిన ప్రసంగాన్ని, రోజాతో కలిసి నగరిలో కేసీఆర్ చేసిన చర్చల క్లిప్పింగ్ లను కూడా రేవంత్ ప్రదర్శించారు. బనకచర్లకు కేసీఆర్ ఆది నుంచి మద్దతు పలికారని, అందులో బీఆర్ఎస్ ప్రభుత్వమే దోషిగా నిలుస్తోందన్నారు. బానకచర్లకు మద్దతు పలికి కేసీఆర్ తెలంగాణకు ద్రోహం చేస్తే… తాము మాత్రం రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా బానకచర్లను అడ్డుకునేందుకు శాయశక్తులా యత్నిస్తున్నామని చెప్పారు. ఈ విషయంలో కేంద్రంతో పోరాటం చేసేందుకు కూడా సిద్ధమేనని, అవసరమైతే సుప్రీంకోర్టు గడప తొక్కేందుకు కూడా వెనుకాడేది లేదని రేవంత్ ప్రకటించారు.