వైసీపీ అధికారంలో ఉన్నన్ని రోజులు జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను పార్ట్ టైం పొలిటీషియన్ అని.. ఉండేది హైదరాబాద్‌లో, రాజకీయం చేసేది ఏపీలో అంటూ ఎద్దేవా చేసేవాళ్లు ఆ పార్టీ అభిమానులు. కానీ గత ఏడాది ఎన్నికల్లో వైసీపీ చిత్తుగా ఓడిపోయాక ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ పార్ట్ టైం పొలిటీషియన్‌గా మారిపోయారు. బెంగళూరులోని తన ప్యాలెస్‌లో ఉంటూ వారం పది రోజుల గ్యాప్‌లో ఇక్కడికి వచ్చి వెళ్తున్నారు. వచ్చినపుడు ఏదైనా అంశం మీద ప్రెస్ మీట్ పెట్టడం, ఎవరినైనా పరామర్శించడానికి వెళ్లడం లాంటివి చేస్తున్నారు.
ఐతే ఆయన ఎవరిని పరామర్శిస్తున్నారు అన్నది ప్రతిసారీ చర్చనీయాంశంగా మారుతోంది. తీవ్ర నేరాల మీద జైలు పాలైన నేతలను కలవడానికి మాత్రమే వస్తారని.. లేదంటే శవ రాజకీయం చేయడానికి చూస్తారని ప్రత్యర్థి పార్టీల నేతలు విమర్శిస్తుంటారు. ఇటీవల తెనాలిలో పోలీసుల చేతుల్లో దెబ్బలు తిన్న రౌడీ షీటర్లకు మద్దతుగా వెళ్లడం విమర్శలకు దారి తీసింది. ఇప్పుడు జగన్ పల్నాడు పర్యటన పెట్టుకున్నారు. ఈ పర్యటనకు అనుమతి లేదని పోలీసులు చెప్పినా జగన్ వినలేదు. జగన్ పర్యటన సందర్భంగా ఎప్పట్లాగే రభస తప్పట్లేదు.
ఇంతకీ జగన్ పల్నాడు పర్యటన ఉద్దేశం ఏంటి అన్నది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఆయన గత ఏడాది ఆత్మహత్యకు పాల్పడిన నాగమల్లేశ్వరరావు కుటుంబాన్ని పరామర్శించడానికి ఈ పర్యటన పెట్టుకున్నారు. ఒక వ్యక్తి చనిపోయిన ఏడాది తర్వాత ఇప్పుడు పరామర్శ ఏంటి అనే ప్రశ్న తలెత్తుతోంది. ఈ నాగమల్లేశ్వరరావు కూటమి ప్రభుత్వ వేధింపుల వల్లే చనిపోయాడని వైసీపీ ఆరోపిస్తోంది. కానీ నాగమల్లేశ్వరరావు ఆత్మహత్యాయత్నం చేసింది జూన్ 6న. చనిపోయింది 9న. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందేమో జూన్ 12న. మరి కూటమి ప్రభుత్వ వేధింపుల వల్లే అతను చనిపోయాడనడం ఏంటన్నది ప్రశ్న.
ఇదిలా ఉండగా.. నాగమల్లేశ్వరరావు ఆత్మహత్యకు దారి తీసిన కారణాల మీద కూడా చర్చ జరుగుతోంది. అతను వైసీపీ మళ్లీ అధికారంలోకి వస్తుందని కోటి రూపాయలకు పైగా బెట్టింగ్ కాశాడట. ఆ డబ్బులు వేరే వాళ్లవట. కానీ వైసీపీ చిత్తుగా ఓడిపోయింది. డబ్బులు కట్టలేని పరిస్థితుల్లో నాగమల్లేశ్వరరావు ఆత్మహత్యకు పాల్పడ్డట్లు గ్రామస్థులు చెబుతున్నారు. అసలు విషయం ఇదైతే.. అతడి మరణానికి కూటమి ప్రభుత్వం కారణం అని ఆరోపిస్తూ, అది కూడా చనిపోయిన ఏడాదికి జగన్ తన కుటుంబ పరామర్శకు వెళ్లడం ఆశ్చర్యం కలిగిస్తోంది.
ఈ గ్రామం చిన్నది కావడంతో వంద మందితో వెళ్లాలని జగన్‌కు పోలీసులు సూచించగా.. ఆయన మాత్రం వేలమందితో ర్యాలీ చేస్తూ పర్యటన చేస్తున్నారు. విశాఖలో యోగా దినోత్సవాన్ని భారీగా నిర్వహించాలని ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్న సమయంలో జగన్ ఉద్దేశపూర్వకంగా రభస చేయడానికే ఈ పర్యటన పెట్టుకున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. మరోవైపు జగన్ పర్యటన సందర్భంగా ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates