ఇచ్చిన మాట కోసం.. ఇంటి రుణం తీర్చిన నారా లోకేష్‌..!

పార్టీ నాయ‌కుడి కుటుంబానికి ఇచ్చిన మాట కోసం మంత్రి నారా లోకేష్ వారి ఇంటి రుణం తీర్చేశారు. అంతేకాదు.. ఆ కుటుంబానికి నెల నెలా ఆదాయం వ‌చ్చే మార్గం కూడా చూపించారు. దీంతో ఆ కుటుంబం ఇప్పుడు సంతోషం వ్య‌క్తం చేస్తోంది. పల్నాడు జిల్లా రొంపిచర్ల మండలం అలవాల గ్రామానికి చెందిన టీడీపీ నేత వెన్నా బాల కోటి రెడ్డి 40 ఏళ్లుగా టీడీపీలో కొన‌సాగుతున్నారు. రొంపిచర్ల మండలం టీడీపీ అధ్య‌క్షుడిగా కూడా ఉన్నారు. ఎంపీపీగా ప‌నిచేశారు.

అయితే.. కొన్నాళ్ల కింద‌ట ఆయ‌న కాల్పుల్లో మృతి చెందారు. ఇది ఎవ‌రు చేశారు? ఎందుకు చేశార‌న్న‌ది ఇప్ప‌టికీ తెలియ‌లేదు. దీంతో ఆ కుటుంబం అనాధ‌గా మారింది. ఇటీవ‌ల వెన్నా స‌తీమ‌ణి, కుమారుడు మంత్రి నారా లోకేష్‌ను క‌లుసుకుని త‌మ ఆవేద‌న‌ను ఆయ‌న‌తో పంచుకున్నారు. ఇంటిపై రుణం ఉందని.. తాము రోజు గ‌డ‌వ‌క ఇబ్బందులు ప‌డుతున్నామ‌ని క‌న్నీటి ప‌ర్యంత‌మ‌య్యారు. దీంతో చ‌లించిపోయిన నారా లోకేష్‌.. ఆ కుటుంబాన్ని ఆదుకుంటాన‌ని హామీ ఇచ్చారు.

ఈ క్ర‌మంలో తాజాగా ఆ కుటుంబానికి ఉన్న ఇంటి రుణాన్నిపూర్తిగా తీర్చేశారు. అదేవిధంగా వెన్నా నాగేంద్ర‌మ్మ‌కు,.. పింఛ‌నుతో పాటు.. పార్టీ త‌ర‌ఫున కూడా నెల నెలా ఆర్థిక సాయం అందేలా చర్య‌లు తీసుకున్నారు. త‌క్ష‌ణ సాయంగా కుటుంబం గ‌డిచేందుకు వీలుగా రూ.ల‌క్ష సాయం అందించారు. వారు ఇంటిపై తెచ్చుకున్న అప్పుమొత్తాన్ని వ‌డ్డీతో స‌హా చెల్లించారు. పార్టీ త‌ర‌ఫున ఏం కావాల‌న్నా చేస్తామ‌ని హామీ ఇచ్చారు. వెన్నా బాలకోటిరెడ్డి కుటుంబానికి పార్టీ అన్ని విధాలా అండ‌గా ఉంటుంద‌ని భ‌రోసా క‌ల్పించారు. దీంతో ఆ కుటుంబం సంతోషం వ్య‌క్తం చేయ‌డం గ‌మ‌నార్హం.