వైసీపీ హయాంలో తన ఫోన్‌ను ట్యాప్ చేసిన మాట వాస్తవమేనని కాంగ్రెస్ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల చెప్పారు. తాజాగా ఆమె విశాఖపట్నంలో మీడియాతో మాట్లాడారు. ఫోన్ ట్యాపింగ్ జరిగింది అనేది వాస్తవమేనని చెప్పారు. “నా ఫోన్, నా భర్త ఫోన్, నా దగ్గర వాళ్ళ ఫోన్ లు ట్యాప్ చేశారు. ఫోన్ ట్యాప్ జరిగినట్లు స్వయంగా వైవీ సుబ్బారెడ్డి నిర్ధారించారు. ఆనాడు ట్యాపింగ్ జరిగిన నా ఆడియో ఒకటి నాకే వినిపించారు. ఫోన్ ట్యాపింగ్ విషయంలో విచారణకు ఎక్కడికి రమ్మన్నా వస్తా” అని షర్మిల చెప్పారు.
“బైబిల్ మీద ప్రమాణం చేసి చెప్తున్న… ఫోన్ ట్యాపింగ్ పచ్చి నిజం” అని తేల్చి చెప్పారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబులు ఈ విషయంలో జోక్యం చేసుకుని ఫోన్ ట్యాపింగ్ విషయం లో విచారణ వేగవంతం చేయాలని ఆమె కోరారు. ఆనాడు జగన్, కేసీఆర్ మధ్య ఉన్న సంబంధం చూసి రక్త సంబంధం కూడా చిన్నబోయిందని విమర్శించారు. తెలంగాణలో రాజకీయంగా, ఆర్థికంగా అణగదొ క్కేందుకు ఇద్దరు కలిసి వేసిన స్కెచ్ ఫోన్ ట్యాపింగేనని చెప్పారు.
“ఆనాడు కేసీఆర్, జగన్ మధ్య మంచి అవినాభావ సంబంధం ఉండేది. ఒకరికి ఒకరు అన్నట్లుగా ఉండే వాళ్ళు. వీళ్ల సంబంధం ముందు రక్త సంబంధం చిన్నబోయింది.” అని షర్మిల వ్యాఖ్యానించారు. ఇద్దరు సీఎంలు కలిసి చేసిన జాయింట్ ఆపరేషన్‌లో తాను బలి అయినట్టు చెప్పుకొచ్చారు. ఫోన్‌ట్యాపింగ్ ఆరోపణలు వచ్చినప్పుడు వైవీ సుబ్బారెడ్డి తమ ఇంటికి వచ్చారని షర్మిల తెలిపారు. ట్యాప్ చేసిన ఒక ఆడియోను ఆయనే స్వయంగా వినిపించారని అన్నారు. అయితే.. ఇప్పుడు సుబ్బారెడ్డి ఆనాటి సంగతిని ఒప్పుకొంటారని తాను అనుకోవడం లేదన్నారు.
జగన్ తన సొంత మేనల్లుడు, మేన కోడలు ఆస్థిని కాజేశారని షర్మిల నిప్పులు చెరిగారు. ఈ విషయంలో సుబ్బారెడ్డితోనూ అబద్ధాలు చెప్పించారని అన్నారు. ఆనాడు ఉన్న పరిస్థితిలో తాను అన్ని విషయాలను బయటకు చెప్పుకోలేక పోయానని షర్మిల తెలిపారు. అప్పుడు జగన్, కేసీఆర్ చేసినవి అరాచకాలని, వారి అరాచకాల్లో ఫోన్ ట్యాపింగ్ విషయం చాలా చిన్నదని షర్మిల పేర్కొన్నారు. ఈ క్రమంలోనే తన భవిష్యత్ ను పాతిపెట్టాలని ఎన్నో కుట్రలు పన్నారని దుయ్యబట్టారు.
“నేను తెలంగాణలో పార్టీ పెట్టడం జగన్ కి ఏ సంబంధం లేదు. కేసీఆర్ కోసం నన్ను తొక్కి పెట్టాలని చూశాడు. నా చుట్టూ పరిస్థితులను కష్టతరం చేశాడు. నా సర్వైవల్ కోసం నేను పోరాటం చేశా. నా ప్రతి పోరాటానికి అడ్డు పడ్డారు” అని షర్మిల వ్యాఖ్యానించారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates