టీపీసీసీ చీఫ్ కు కేటీఆర్ లీగల్ సవాల్

తెలంగాణలో ఏడాదిన్నరగా రాజకీయం రంజుగా సాగుతోంది. రోజుకో కొత్త మలుపులతో సాగుతున్న టీ పాలిటిక్స్ లో ఎప్పటికప్పుడు ఆరోపణలు, ప్రత్యారోపణలు.. దూషణలు, ప్రతి దూషణలు.. కేసులు, ప్రతి కేసులు.. విచారణలు, హెచ్చరికలు.. ఇలా రసవత్తరంగా రాజకీయం నడుస్తోంది. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో మంగళవారం మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. టీపీసీసీ చీఫ్ బొమ్మా మహేశ్ కుమార్ గౌడ్ కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి ఏకంగా లీగల్ నోటీసులు పంపించారు. 

అసలేం జరిగిందన్న విషయానికి వస్తే… బీఆర్ఎస్ హయాంలో ఫోన్ ట్యాపింగ్ జరిగిందన్న వ్యవహారంపై ఇప్పుడు ఏకంగా భారీ దర్యాప్తే జరుగుతోంది కదా. ఈ దర్యాప్తులో భాగంగా కీలక నిందితులుగా భావిస్తున్న నాటి పోలీసు అదికారులను సిట్ అదికారులు రోజుల తరబడి ప్రశ్నించారు. ఇంకా ప్రశ్నిస్తూనే ఉన్నారు. తాజాగా ఈ కేసులో సాక్షి కింద మహేశ్ గౌడ్ సిట్ విచారణకు హాజరయ్యారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ సర్కారు ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడిందని, అందులో పలువురు మహిళల ఫోన్లను, విపక్షాల నేతల ఫోన్లు, న్యాయమూర్తుల ఫోన్లు, చివరాఖరుకు ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి ఫోన్ నూ ట్యాప్ చేశారని సిట్ కు చెప్పారు.

ఈ విషయం తెలిసినంతనే కేటీఆర్ తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. ఫోన్ ట్యాపింగ్ పేరిట లేని కేసును సృష్టించిన కాంగ్రెస్ సర్కారు తన అసమర్థతను కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీలు, 420 హామీలను అమలు చేయడానికి చేతగాని కాంగ్రెస్ సర్కారు ఫోన్ ట్యాపింగ్ పేరిట అటెన్షన్ డైవర్షన్ పాలిటిక్స్ కు పాల్పడుతోందని మండిపడ్డారు. సిట్ విచారణలో మహేశ్ గౌడ్ చెప్పిన విషయాలన్నీ పచ్చి అబద్ధాలనీ ఆయన ఆరోపించారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న మహేశ్..ఇలాంటి తప్పుడు స్టేట్ మెంట్లు ఎలా ఇస్తారని ప్రశ్నించారు.

సిట్ కు ఇచ్చిన వాంగ్మూలంలో సాంతం అబద్ధాలను చెప్పిన మహేశ్ కుమార్ గౌడ్ భేషరతుగా క్షమాపణ చెప్పాలని ఈ సందర్భంగా కేటీఆర్ డిమాండ్ చేశారు. కేవలం తన రాజకీయ పబ్బం గడుపుకునేందుకు అబద్ధపు సాక్ష్యాలను ఇచ్చిన మహేశ్ బేషరతుగా క్షమాపణ చెప్పకుంటే కోర్టుకు ఈడుస్తామని కూడా కేటీఆర్ హెచ్చరించారు. అబద్ధపు ప్రచారాలతో విపక్షాలపై దాడులు చేస్తే… చూస్తూ ఊరుకోవడానికి బీఆర్ఎస్ సిద్ధంగా లేదని, తగిన సమయంలో తగిన రీతిలో బుద్ధి చెబుతామని కూడా ఆయన వార్నింగ్ ఇచ్చారు. మరి కేటీఆర్ కోరినట్లుగా మహేశ్ క్షమాపణ చెబుతారో, లేదంటే లీగల్ యుద్ధానికే దిరుతారో చూడాలి.