అమరావతికి బూస్ట్!.. ఆ రెంటికీ కేంద్రం ఓకే!

ఏపీ రాజధాని అమరావతిలో ఇప్పుడు ఎక్కడ చూసిన పండుగ వాతావరణం కనిపిస్తోంది. అమరావతి కోసం సేకరించిన భూముల్లో ఎక్కడికక్కడ నిర్మాణ పనులకు సన్నాహాలు జరుగుతున్నాయి. కొన్ని చోట్ల ఏకంగా పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో అమరావతికి కేంద్రం ఓ శుభవార్త చెప్పింది. ఈ వార్త అమరావతి నిర్మాణానికి నిజంగానే బిగ్ బూస్ట్ అని చెప్పక తప్పదు. రాజధాని నగరంలోని రెండు కీలక నిర్మాణాలను తానే నిర్మించి ఇస్తానని కేంద్రం మంగళవారం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది.

ఏ రాష్ట్ర రాజధానిలో అయినా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు కొన్ని కొనసాగుతూ ఉంటాయి కదా. వాటిలో పనిచేసే ఉద్యోగులకు కేంద్రమే ఆవాసం కల్పిస్తోంది. ఇందుకోసం సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కోసం క్వార్టర్స్ ను నిర్మిస్తోంది. అదేసమయంలో కామన్ సెంట్రల్ సెక్రటేరియట్ భవనాలను కూడా కేంద్రమే నిర్మిస్తోంది. కొత్తగా పురుడు పోసుకుంటున్న అమరావతి నిర్మాణం ప్రారంభమైనప్పుడే 2014 తర్వాత ఈ రెంటి కోసం స్థలాన్ని తీసుకుని భవన నిర్మాణాలను కూడా సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్ మెంట్ (పీసీడబ్ల్యూడీ) మొదలుపెట్టింది. అయితే వైసీపీ ప్రభుత్వం రావడంతో అమరావతి నిర్మాణంతో పాటుగా ఈ నిర్మాణాల పనులు ఎక్కడికక్కడ ఆగిపోయాయి. 

అయితే ఐధేళ్లు ఇలా గిర్రున తిరిగిపోగా… తిరిగి టీడీపీ నేతృత్వంలోని కూటమి సర్కారు ఏపీ పాలనా బాధ్యతలను చేపట్టింది. ఆ వెంటనే అమరావతి నిర్మాణ పనుల్లోనూ ఊపు కనిపించింది. ఇక కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏలో కీలక భాగస్వామిగా ఉన్న టీడీపీ అడగంగానే కేంద్రం అన్ని పనులూ ఇట్టే చేసేస్తోంది. ఇప్పటికే వరల్డ్ బ్యాంకు నుంచి రూ.15 వేల కోట్లు, హడ్కో నుంచి రూ.11 వేల కోట్లు అప్పుగా ఇప్పించిన కేంద్రం… తాజాగా అమరావతికి మరింత బూస్ట్ ఇచ్చేలా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల క్వార్టర్లు, కామన్ సెంట్రల్ సెక్రటేరియట్ ల పనులను ప్రారంబించేందుకు సిద్ధమైంది. 

ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ అధికారికంగా ఉత్వర్లులు జారీ చేయగా… అందుకు అయ్యే నిదులను కూడా కేంద్ర పట్టణాభివృద్ది శాఖకు విడుదల చేసింది. ఈ మేరకు మంగళవారం డిల్లీలో కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ను కలిసిన టీడీపీ యువనేత, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ కేంద్రానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల భవనాల నిర్మాణానికి రూ.1,329 కోట్లు, కామన్ సెంట్రల్ సెక్రటేరియట్ కు రూ.1,459 కోట్లను కేంద్రం వెచ్చించనుంది. ఈ రెండింటి విలుల రూ.2,787 కోట్లుగా ఉంది. ఈ భవనాల నిర్మాణంతో ఇక అమరావతి నిర్మాణాన్ని ఆపడం ఏ ఒక్కరి తరం కాదని చెప్పక తప్పదు.