‘ఇచ్చిన మాట’ నిల‌బెట్టుకున్న కూట‌మి ప్ర‌భుత్వం

‘ఆప‌రేష‌న్ సిందూర్’ స‌మ‌యంలో పాకిస్తాన్ తూటాకు బ‌లై.. వీర‌మ‌ర‌ణం పొంది, దేశం కోసం ప్రాణాలర్పించిన వీర జవాను మురళీ నాయక్ కుటుంబానికి కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట నిల‌బెట్టుకుంది. శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కల్లితండాకు చెందిన మురళీ నాయక్ తల్లీతండ్రులను ఆదుకుంటామ‌ని ఏప్రిల్‌లో జ‌రిగిన ఘ‌ట‌న అనంత‌రం.. ప్ర‌భుత్వం పేర్కొంది. ఈ క్ర‌మంలో ఆ కుటుంబానికి 50 ల‌క్ష‌ల రూపాయ‌లు ఆర్థిక సాయంతోపాటు.. ఐదు ఎక‌రాల పొలాన్ని, ఆరు సెంట్ల ఇంటి స్థ‌లాన్ని ప్ర‌భుత్వం కేటాయించింది. దీనికి సంబందించిన చెక్కు, ఇంటి, పొలం ప‌త్రాల‌ను తాజాగా మంత్రి స‌విత అందించారు.

ఈ సంద‌ర్భంగా మంత్రి స‌విత మాట్లాడుతూ.. భరతమాత ముద్దు బిడ్డ మురళీ నాయక్ అని కొనియాడారు. దేశ ప్రజలందరి గుండెల్లో మురళీ నాయక్ చిరస్థాయిగా నిలిచిపోతారన్నారు. దేశ ప్రజలతో పాటు కూటమి ప్రభుత్వం కూడా అండగా ఉంటుందని వీర జవాను తల్లిదండ్రులను ఓదార్చారు. ఏ కష్టం వచ్చినా తనను సంప్రదిస్తే వెన్నుదన్నుగా ఉంటానని భరోసా ఇచ్చారు. అంతకుముందు కల్లితండాలోని మురళీ నాయక్ ఘాటు వద్దకెళ్లి నివాళులర్పించారు. మురళీ నాయక్ కుటుంబానికి కూటమి ప్రభుత్వం ఎల్లవేళలా అండగా ఉంటుందన్నారు. త్వరలోనే మురళీ నాయక్ నివాసం నుంచి ఘాటు వరకూ రూ.16 లక్షల వ్య‌యంతో సీసీ రోడ్డు నిర్మించనున్నట్లు వెల్లడించారు.

గోరంట్లతో పాటు జిల్లా కేంద్రంలో కూడా మురళీ నాయక్ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి స‌విత తెలిపారు. కుటుంబానికి ఇచ్చిన మాట ప్ర‌కారం.. ప్ర‌భుత్వం న‌గ‌దు, ఇంటి స్థ‌లంతోపాటు పొలాన్ని కూడా కేటాయించింద‌న్నారు. సీఎం చంద్ర‌బాబు స్వ‌యంగా రావాల‌ని అనుకున్నార‌ని.. కానీ, ఆయ‌న యోగాంధ్ర ప‌నుల్లో బిజీగా ఉన్న నేప‌థ్యంలో త‌న‌ను పంపించార‌ని పేర్కొన్నారు.ఇదిలావుంటే.. రెండు రోజుల కింద‌ట జ‌న‌సేన త‌ర‌ఫున తిరుప‌తి, పాల‌కొండ ఎమ్మెల్యేలు ముర‌ళీ నాయ‌క్ కుటుంబాన్ని క‌లిసి పార్టీ త‌ర‌ఫున 25 ల‌క్ష‌ల రూపాయ‌ల ఆర్థిక సాయం అందించారు. దీనికి ముందు వైసీపీ కూడా రూ.25 ల‌క్ష‌ల రూపాయ‌ల చెక్కును కుటుంబానికి అందించింది. మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వం కూడా 25 ల‌క్ష‌ల రూపాయ‌ల చెక్కును ఇచ్చింది.