వైసీపీ హ‌యాంలో ష‌ర్మిల ఫోన్ ట్యాపింగ్‌?!

ఏపీలో వైసీపీ హ‌యాంలో అప్ప‌టి సీఎం జ‌గ‌న్‌కు, ఆయ‌న సోద‌రి వైఎస్ ష‌ర్మిల ఫోన్ ల‌ను ట్యాప్ చేశారా? ఆమె ఎవ‌రితో మాట్లాడుతున్నారు? ఎవ‌రితో రాజ‌కీయంగా అడుగులు ముందుకు వేస్తున్నారు? ఎవ‌రి స‌ల‌హాలు తీసుకుంటున్నారు? అనే కీల‌క విష‌యాల‌ను అప్ప‌ట్లోనే తెలుసుకున్నారా? అంటే..తాజాగా దీనికి సంబంధించిన స‌మాచారం బ‌య‌ట‌కు వ‌చ్చింది. వైఎస్ షర్మిల ఫోన్ సైతం ట్యాప్ అయింద‌ని తాజాగా వెలుగు చూసింది.

వైసీపీ హ‌యాంలో జ‌గ‌న్‌కు, ష‌ర్మిల‌కు మ‌ధ్య వివాదాలు, విభేదాలు తెర‌మీదికి వ‌చ్చిన విష‌యం తెలిసిం దే. ఈ క్ర‌మంలోనే ఆమె తెలంగాణ‌లో సొంత పార్టీ పెట్టుకున్నారు. వైఎస్సార్ తెలంగాణ పార్టీ పేరుతో ఆమె కొత్త పార్టీకి జీవం పోశారు. అయితే.. ఈ క్ర‌మంలో ఆమె ఎవ‌రెవ‌రితో మాట్లాడార‌నే విష‌యాలు తెలుసుకునేందుకు ష‌ర్మిల ఫోన్‌ను కూడా ట్యాప్ చేశార‌ని ప్ర‌స్తుతం తెలుస్తోంది. తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసు విచారిస్తున్న నేప‌థ్యంలో ఈ కీల‌క విష‌యాలు వెలుగు చూస్తున్నాయి.

జగన్ చెల్లెలు, ప్ర‌స్తుత‌ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఫోన్లు ట్యాప్ అయిన‌ట్టు స‌మాచారం. అత్యంత గోప్యంగా షర్మిల మొబైల్స్ ట్యాప్ చేశార‌ని, షర్మిల కోసం కోడ్ భాష వినియోగించార‌ని కూడా తెలుస్తోంది. వైసిపి అధికారంలో ఉన్న సమయంలో షర్మిల వాయిస్ రికార్డులు, ఎవరెవరితో మాట్లాడుతున్నారనే సమాచారాన్ని ఎప్పటికప్పుడు “అన్నకు ” చేర‌వేసిన‌ట్టు స‌మాచారం. అదేస‌మ‌యంలో షర్మిల మాట్లాడే ప్రతి ఒక్కరిపై నిఘా పెట్టార‌ని తెలుస్తోంది.

అంతేకాదు.. షర్మిలకు స‌న్నిహితంగా ఉండే వారిని పిలిచిన అప్ప‌టి ఓ సీనియర్ పోలీస్ అధికారి వారికి వార్నింగ్ ఇచ్చార‌ని.. కూడా వెలుగు చూసింది. తన ఫోన్లు ట్యాప్ అవుతున్నట్లు అప్పట్లోనే గుర్తించిన షర్మిల.. ఎందుకు మౌనంగా ఉన్నార‌న్న‌ది ప్ర‌శ్న‌. అంతేకాదు.. తన ఫోన్లు ట్యాప్ విషయంలో షర్మిల వద్ద కీలక సమాచారం ఉన్న‌ట్టు తెలుస్తోంది. మ‌రి దీనిపై ఎలాంటి కేసులు న‌మోదు చేస్తారో చూడాలి.