మీరు రమ్మంటేనే… లేదంటే లేదు: లారెన్స్

తమిళనాడు రాజకీయాల్లో సినీ స్టార్ల హవా ఓ రేంజిలో కొనసాగుతోంది. మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాదించిన స్టార్ హీరో దళపతి విజయ్… ఇప్పుడు ఏకంగా తమిళనాడు ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. సింగిల్ దెబ్బకు సీఎం సీటు వచ్చి విజయ్ ఒడిలో వాలిపోయిన తీరు నిజంగానే అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.

విజయ్ విజయంతో మరింత మంది సినీ స్టార్లు పాలిటిక్స్ బాట పట్టడం ఖాయంగానే కనిపిస్తోంది. ఆ వరుసలో ముందుగా ఉన్నది మాత్రం ప్రముఖ కొరియోగ్రాఫర్, దర్శకుడు, నటుడు రాఘవ లారెన్స్. ఇప్పటికే తన పొలిటికల్ ఎంట్రీపై ఆసక్తి రేకెత్తించిన రాఘవ… ఇప్పుడు తన రాజకీయ రంగప్రవేశాన్ని ప్రజలకే వదిలేసి మరింత ఆసక్తి రేకెత్తించారు.

సీఎం విజయ్ రాజీనామా చేసిన తిరుచ్చి ఈస్ట్ కు జరగనున్న ఉప ఎన్నికలో విజయ్ పార్టీ అభ్యర్థిగా లారెన్స్ నిలుస్తారని గత కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయంపై మొన్నామధ్య స్పందించిన లారెన్స్.. ఊహాగానాలకు ఫుల్ స్టాప్ పెట్టాల్సింది పోయి… వాటిని మరింతగా పెంచేశారు.

ఈ నెల 11వ తేదీన తన నిర్ణయాన్ని చెబుతానని పేర్కొన్న ఆయన.. భారతిరాజా మరణంతో తన నిర్ణయాన్ని శుక్రవారానికి వాయిదా వేశారు. తాజాగా శుక్రవారం ఉదయమే తన మనసులోని భావనను సోషల్ మీడియా వేదికగా పెట్టేసిన లారెన్స్… నా తదుపరి ప్రయాణం మీ నిర్ణయం మీదే ఆధారపడి ఉంటుందని ఓ ట్విస్ట్ ఇచ్చారు.

ఈ దిశగా ఇప్పుడు పెను వైరల్ గా మారిన సందేశంలో రాఘవ ఎమన్నారన్న విషయానికి వస్తే… ఏ పని చేసినా ఫలితాన్ని ఆశించకుండా సాగిపోవాలన్న మాటతో ఆయన తన సందేశాన్ని మొదలుపెట్టారు. తన రాజకీయ రంగ ప్రవేశంపై తాను ఇంకా నిర్ణయం తీసుకోలేదన్న లారెన్స్.. ఈ విషయంలో ప్రజలదే నిర్ణయమని చెప్పారు.

ప్రజలు తనను రాజకీయాల్లోకి రావద్దంటే రాబోనని… ప్రస్తుతం తాను చేస్తున్న సేవలతోనే సరిపెట్టుకుంటానని చెప్పారు. అలా కాకుండా తాను రాజకీయాల్లోకి రావాలని మీకు అనిపిస్తే…ఏ పార్టీలో ఏ రీతిన చేరాలో కూడా చెప్పాలని ఆయన పేర్కొన్నారు.

మొత్తంగా తన రాజకీయ రంగ ప్రవేశానికి సంబంధించిన నిర్ణయాన్ని లారెన్స్ తనదైన శైలిలో ప్రజలకే వదిలేశారన్న విశ్లేషణలు అయితే ఆసక్తి రేకత్తిస్తున్నాయి. తన రాజకీయ రంగ ప్రవేశానికి సంబంధించి ఇప్పటికే ఆయన ఓ నిర్ణయం అయితే తీసుకుని ఉంటారని, దానిని బయటపెట్టకుండా… ఆ నిర్ణయాన్ని ప్రజలకే వదిలేసినట్లుగా ఆయన ఓ గేమ్ ఆడుతున్నారన్న వాదనలూ వినిపిస్తున్నాయి. మొత్తంగా తన రాజకీయ రంగ ప్రవేశంపై నిర్ణయాన్నే ఇలా సరికొత్తగా తేల్చేసిన రాఘవ.. ఇక పాలిటిక్స్ల లోకి వస్తే ఇంకెంత ఆసక్తి రేపే నిర్ణయాలు తీసుకుంటారోనన్న విశ్లేషణలు సాగుతున్నాయి.