ఏపీ రాజధాని అమరావతి ప్రాంతంలో కీలకమైన మూలపాడు గ్రామానికి మహర్దశ పట్టనుందా? ఈ గ్రామం అమరావతికి ‘ఓపెన్ వే'(ముఖ ద్వారం) కానుందా? అంటే.. ఔననే అంటున్నారు పరిశీలకులు. అమరావతి కోసం రైతుల నుంచి 34 వేల ఎకరాలకు పైగా ఇప్పటికే సమీకరించారు. దీనిలో అమరావతి ప్రధాన మార్గాన్ని ఎక్కడ ఏర్పాటు చేయాలన్న చర్చ వచ్చినప్పుడు మూలపాడువైపు అధికారులు, ప్రభుత్వం కూడా మొగ్గు చూపుతోంది.
దీంతో రాజధాని ముఖద్వారాన్ని మూలపాడు గ్రామం దగ్గర ఏర్పాటు చేయాలని సర్కారు భావిస్తోంది. అంటే.. ఈ ప్రాంతంలోనే రాజధానికి సంబంధించిన కీలకమైన ‘ఐకానిక్ బ్రిడ్జి’ ఏర్పాటు చేయనున్నారు. ఈ నేపథ్యంలో మూల పాడు గ్రామానికి చేరువలో ఉన్న విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారిపై ఉన్న ఇబ్రహీంపట్నం మండలంలో భూసార పరీక్షలు జరుగుతున్నాయి. ఇది పూర్తయిన వెంటనే ఐకానిక్ బ్రిడ్జి నిర్మాణాలు త్వరలో ప్రారంభమవుతున్నాయి.
మూలపాడు గ్రామంలో రాజధాని ముఖ ద్వారాన్ని ఏర్పాటు చేసేలా స్థానిక ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ఇప్పటికే సీఎం సహా సీఆర్ డీఏ అధికారులకు వివరాలు అందించారు. అంటే.. అమరావతికి వెళ్లాలని అనుకునేవారు.. మూలపాడులో ఏర్పాటు చేసే ముఖ ద్వారం గుండానే ప్రవేశించాల్సి ఉంటుంది. అయితే.. ఇది హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై వచ్చే వారికి అందుబాటులో ఉంటుంది.
ఇక, గుంటూరు, ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారికి.. ఉండవల్లి నుంచి ఇప్పటికే కరకట్ట దారిని ఏర్పాటు చేశారు. దీనిని ఆరు లేన్ల రహదారిని చేయనున్నారు. ఏదేమైనా మూలపాడుకు మహర్దశ పట్టనుందని అధికారులు కూడా చెబుతున్నారు. ఇది అమరావతికి గేమ్ ఛేంజర్‌గా మారుతుందని అంటున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates