మ‌రో రికార్డుకు చేరువ‌లో ఏపీ: చంద్ర‌బాబు

మ‌రో అరుదైన ప్ర‌పంచ రికార్డును సొంతం చేసుకునే దిశ‌గా ఏపీ వ‌డివ‌డిగా అడుగులు వేస్తోందని సీఎం చంద్ర‌బాబు చెప్పారు. గ‌త ప‌దేళ్ల కింద‌ట నిర్వ‌హించిన‌ట్టుగా..ఇప్పుడు కూడా అంత‌ర్జాతీయ యోగా దినోత్స‌వాన్ని అంతకంటే ఘ‌నంగా నిర్వ‌హించ‌నున్న ట్టు ఆయ‌న తెలిపారు. ఈ నెల 21న అంత‌ర్జాతీయ యోగా దినోత్స‌వాన్ని పుర‌స్క‌రించుకుని రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా.. ఈకార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించేందుకు ఏర్పాటు చేస్తోంది. విశాఖ‌ప‌ట్నంలోని ప‌ర్యాట‌క ప్రాంతం ఆర్కే బీచ్ నుంచి భీమిలి అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలోని బీచ్ వ‌ర‌కు ఒకే స‌మ‌యంలో 5 ల‌క్ష‌ల మందితో యోగా నిర్వ‌హించేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తున్నారు.

ఈ కార్య‌క్ర‌మానికి ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ స‌హా.. ప‌లువురు దౌత్యాధికారులు, విదేశీ ప్ర‌తినిధులు కూడా హాజ‌రు అవుతు న్నారు. సినీ రంగం నుంచి కొంద‌రికి రాష్ట్ర ప్ర‌భుత్వం ఆహ్వ‌నాలు పంపుతోంద‌ని స‌మాచారం. ఈ నేప‌థ్యంలో సీఎం చంద్ర‌బాబు తాజాగా విశాఖ‌ప‌ట్నంలో యోగాకు సంబంధించి జ‌రుగుతున్న ఏర్పాట్లను ప‌రిశీలించారు. క్షేత్ర‌స్థాయిలో ఆయ‌న ప‌ర్య‌టించి.. బీచ్ పొడ‌వునా చేసిన ఏర్పాట్ల‌ను ప‌రిశీలించారు. సాధార‌ణ ప్ర‌జ‌ల‌కు ఎలాంటి ఇబ్బందులు రాకుండా కూడా ఏర్పాట్లు చేయాల‌ని సూచించారు. అదేస‌య‌మంలో వీఐపీల‌కు ఎలాంటి ఇబ్బందులు త‌లెత్త‌కుండా కూడా ఏర్పాట్లు చేయాల‌ని అధికారుల‌ను ఆదేశించారు.

ఈ సంద‌ర్భంగా సీఎం చంద్ర‌బాబు మీడియాతో మాట్లాడుతూ.. దాదాపు ప‌దేళ్ల త‌ర్వాత‌.. రాష్ట్రంలో అతి పెద్ద యోగా కార్య‌క్ర‌మాని కి శ్రీకారం చుట్టామ‌న్నారు. ప్ర‌ధాని మోడీ కూడా వ‌స్తున్నార‌ని, దీంతో ఏపీ ప్ర‌తిష్ట ప్ర‌పంచానికి తెలిసేలా ఏర్పాట్లు ఉండాల‌ని ఆదేశించిన‌ట్టు తెలిపారు. సెక్రటేరియట్‌ సిబ్బంది, పోలీసులు సమన్వయంతో పని చేస్తార‌ని చెప్పారు. “యోగా నిర్వహణలో కొత్త రికార్డు సృష్టించబోతున్నాం. దాదాపు 3.4 లక్షల మందికి ఒకే ప్రాంతంలో ఏర్పాట్లు చేస్తున్నాం” అని సీఎం వివ‌రించారు. ఈ కార్య‌క్ర‌మానికి అంద‌రూ ఆహ్వానితులేన‌ని చెప్పారు. రాష్ట్రం కొత్త రికార్డు దిశ‌గా వ‌డివ‌డిగా దూసుకుపోతోంద‌ని.. ఖ‌చ్చితంగా రికార్డు సృష్టిస్తామ‌ని చెప్పారు. ఇప్ప‌టి వ‌ర‌కు యోగా విష‌యంలో ఉన్న రికార్డుల‌ను తోసిపుచ్చి.. ఏపీ స‌రికొత్త రికార్డును సృష్టిస్తుంద‌ని సీఎం చంద్ర‌బాబు ఆశాభావం వ్య‌క్తం చేశారు.