ఇటీవలి కాలంలో తెలంగాణలో రాజకీయం రసవత్తరంగా సాగుతోంది. పదేళ్ల పాలన తర్వాత బీఆర్ఎస్ విపక్షంలోకి మారగా… తెలంగాణను ఇచ్చిన కాంగ్రెస్ ఏడాదిన్నర క్రితం కొత్తగా అదికారం చేపట్టింది. ఈ క్రమంలో పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో లెక్కలేనన్ని అక్రమాలు జరిగాయంటూ ఆరోపణలు గుప్పించిన కాంగ్రెస్ సర్కారు…ఆయా అంశాలపై విచారణకు ఆదేశాలు జారీ చేసింది. ఈ విచారణలతో సంబంధం ఉన్నా, లేకున్నా పార్టీ తరఫున పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు అహరహం శ్రమిస్తున్నారు. ఈ క్రమంలో మరీ బిజీ షెడ్యూల్ కారణంగా ఆయన సోమవారం మీడియా ప్రతినిధులతో మాట్లాడే సమయంలోనే అస్వస్థతకు గురయ్యారు.
సోమవారం ఫార్ములా ఈ కారు రేసుల వ్యవహారంలో కేటీఆర్ ఏసీబీ విచారణకు హాజరైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఉదయమే నందినగర్ లోని కేటీఆర్ నివాసానికి వచ్చిన హరీశ్… కేసీఆర్, కేటీఆర్ లతో సుదీర్ఘంగా మంతనాలు సాగించారు. ఆపై బీఆర్ఎస్ కార్యాలయానికి కూడా ఆయన కేటీఆర్ వెంటే సాగారు. కేటీఆర్ విచారణకు వెళ్లిపోగా… బీఆర్ఎస్ ఆఫీసులోనే ఉండి పార్టీ శ్రేణులు, ఎమ్మెల్యేలు, కీలక నేతలతో మంతనాలు సాగిస్తూ కొనసాగారు. కేటీఆర్ విచారణ సుదీర్ఘంగా 9 గంటల పాటు సాగగా… అప్పటిదాకా హరీశ్ అక్కడే ఉన్నట్లు సమాచారం. ఈ క్రమంలో విచారణ ముగించుకుని కేటీఆర్ బీఆర్ఎస్ ఆఫీస్ కు చేరగా.. ఆయనతో కలిసి హరీశ్ మీడియాతో మాట్టాడారు.
తాను మాట్టాడినంత దాకా బాగానే ఉన్న హరీశ్.. ఆ తర్వాత కేటీఆర్ మాట్లాడుతున్న సమయంలో అసౌకర్యంగా కనిపించారు. అటు చూస్తూ, ఇటు చూస్తూ సాగిన హరీశ్… ఇక తాను నిలబడలేనని ఓ అంచనాకు వచ్చిన ఆయన… ఓ వైపు కేటీఆర్ మాట్లాడుతూ ఉండగానే…ఆయన వెనక నుంచి వెళ్లిపోయారు. హరీశ్ అసౌకర్యాన్ని గుర్తించిన పార్టీ నేతలు ఆయన అస్వస్థతకు గురయ్యారని హుటాహుటీన బేగంపేటలోని స్కిమ్స్ సన్ షైన్ ఆసుపత్రికి తరలించారు. హరీశ్ ను పరిశీలించిన వైద్యులు ఆయన హై ఫీవర్ తో బాధపడుతున్నట్లు నిర్ధారించి చికిత్స మొదలుపెట్టారు.
ఇదిలా ఉంటే… ఇటీవలి కాలంలో హరీశ్ రావు ఫుల్ బిజీ అయిపోయారు. కాళేశ్వరం కమిషన్ విచారణకు రావాలంటూ కేసీఆర్ కు నోటీసులు రాగానే…నాడు సాగు నీటి శాఖ మంత్రిగా ఉన్న హరీశ్ రోజుల తరబడి ఎర్రవలి ఫామ్ హౌస్ కు వెళ్లి విచారణలో ఎలాంటి సమాధానాలు చెప్పాలన్న దానిపై సుదీర్ఘ మంతనాలు సాగించారు. ఇక పార్టీలో కేటీఆర్, కవితల మధ్య పొరపొచ్చాల నేపథ్యంలో ఏ చిన్న సమస్య వచ్చినా కేసీఆర్… హరీశ్ రావు మీదే ఆధారపడుతున్నారు. ఇక సోమవారం అయితే ఉదయం నుంచి కూడా హరీశ్ టెన్షన్ టెన్షన్ గానే గడిపిన నేపథ్యంలోనే ఆయన అనారోగ్యానికి గురైనట్టుగా తెలుస్తోంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates