పొంగులేటీపై టీపీసీసీ చీఫ్ గుస్సా.. రీజనేంటి?

వారిద్దరూ తెలంగాణలోని అదికార పార్టీకి చెందిన వారే. ఒకరేమో మంత్రిగా కొనసాగుతున్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. మరొకరేమో పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు బొమ్మా మహేశ్ కుమార్ గౌడ్. ఈ ఇద్దరి మధ్య మంచి సంబంధాలే ఉన్నాయి. వీరి మధ్య ఇప్పటిదాకా పెద్దగా విబేధాలన్న మాటే లేదు. అయితే ఒకే ఒక్క విషయం… పొంగులేటిపై మహేశ్ గౌడ్ అంతెత్తున ఎగిరి పడేలా చేసింది. ఇదేం ఆతృత? చూసుకొని మాట్లాడాలిగా… అంటూ ఆయన మంత్రిగారి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

పొంగులేటిపై మహేశ్ గుస్సాకు కారణమేమిటన్న విషయానికి వస్తే… రేవంత్ రెడ్డి కేబినెట్ లో రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖలతో పాటుగా ఐఅండ్ పీఆర్ శాఖల మంత్రిగా పొంగులేటి కొనసాగుతున్నారు. ఈ శాఖలకు సంబంధించిన అంశాలు తప్పించి ఇతరత్రా అంశాలతో పొంగులేటికి సంబంధం లేదు. నిబంధనల మేరకు పొంగులేటి తన పరిధిలోని శాఖల గురించి మాత్రమే మాట్లాడాలి. అయితే ఆదివారం పాలేరులో నిర్వహించిన ఓ సభలో ఆయన ఏకంగా స్థానిక సంస్థల ఎన్నికల గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ నెలాఖరులోగానే స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ రానుందని, అందరూ సిద్ధంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు.

పొంగులేటి వ్యాఖ్యలతో ఆదివారం మధ్యాహ్నం నుంచే తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల సందడి నెలకొంది. ఎన్నికలకు ఆయా పార్టీలు ఏ మేర సిద్ధంగా ఉన్నాయంటూ దాదాపుగా అన్ని మీడియా సంస్థలు కథనాలు రాసేశాయి. ఇక బీసీ రిజర్వేషన్లను తేల్చకుండా కాంగ్రెస్ స్థానిక సంస్థల ఎన్నికలను ఎలా నిర్వహిస్తుందని బీఆర్ఎస్ ఎదురు దాడికి దిగింది. వాస్తవానికి రిజర్వేషన్ల ఖరారు, రొటేషన్ ఇవన్నీ చూసుకున్న తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు  ఏర్పాట్లు జరుగుతాయి. అయినా స్థానిక సంస్థలైన పంచాయతీ, మండల, జిల్లా పరిషత్ లు పంచాయతీరాజ్ శాఖ కిందకు వస్తాయి. ఈ శాఖ సీతక్క ఆధ్వర్యంలో ఉంది. ఇక మునిసిపల్ శాఖ సీఎం రేవంత్ వద్ద ఉంది. వారిద్దరి ప్రమేయం లేకుండానే పొంగులేటి ప్రకటన చేసేశారు.

బీసీ రిజర్వేషన్లను తేల్చకుండా స్థానిక సంస్థల ఎన్నికలను ఎలా నిర్వహిస్తారన్న అంశం నిజంగానే కాంగ్రెస్ కు సంకట పరిస్థితిని తీసుకొచ్చేదే. మూకుమ్మడిగా విపక్షాలన్నీ ఒకేసారి ఇదే అంశాన్ని భుజానికెత్తుకుంటే.. ఆన్సర్ ఇవ్వడం కాంగ్రెస్ కు కష్టమే. అందుకే కాబోలు… పరిస్థితిని సాంతం సమీక్షించిన మహేశ్ గౌడ్… పొంగులేటి ప్రకటనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కేబినెట్ లో చర్చించి నిర్ణయం తీసుకోవాల్సిన అంశాలను ముందుగానే ఎలా ప్రస్తావిస్తారని పొంగులేటిని మహేశ్ ప్రశ్నించారు. అంతేకాకుండా మీకు సంబంధం లేని శాఖ విషయాల గురించి మీరెందుకు మాట్లాడటం అని కూడా ఆయన పొంగులేటికి గుర్తు చేశారు. కోర్టు పరిధిలో ఉన్న అంశాలపై మాట్లాడేటప్పుడు అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకోవాలన్న జాగ్రత్తలు పాటించకపోతే ఎలాగని కూడా ఆయన ప్రశ్నించారు. మరి మహేశ్ గుస్సాకు పొంగులేటి ఏ రీతిన ఆన్సర్ ఇస్తారో చూడాలి.