దేవుడు వరమిచ్చినా… పూజారి కరుణించలేదన్న సామెతలా మారింది సాక్షి ఇన్ పుట్ ఎడిటర్, సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావు పరిస్థితి. అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యల కేసులో అరెస్టైన కొమ్మినేని బెయిల్ కోసం సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టును ఆశ్రయించగా..శుక్రవారమే ఆయనకు బెయిల్ మంజూరు చేస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాకుండా తక్షణమే కొమ్మినేనిని జైలు నుంచి విడుదల చేయాలని కూడా కోర్టు ఆదేశించింది. అయితే బెయిల్ లభించి ఆదివారం నాటికి మూడు రోజులు అవుతున్నా..కొమ్మినేని ఇంకా జైలులోనే కాలం వెళ్లదీస్తున్నారు.
ఇటీవల సాక్షి టీవీలో కొమ్మినేని నేతృత్వంలో జరిగిన చర్చా కార్యక్రమంలో జర్నలిస్టు కృష్ణంరాజు అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. చర్చను నిర్వహిస్తున్న యాంకర్ గా కొమ్మినేని కృష్ణంరాజును వారించకుండా ముసిముసిగా నవ్విన కొమ్మినేని చిక్కుల్లో పడ్డారు. ఈ విషయాన్ని సీరియస్ గా పరిగణించిన కూటమి సర్కారు… కృష్ణంరాజును ఏ1గా, కొమ్మినేనిని ఏ2గా పేర్కొంటూ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో తొలుత కొమ్మినేనిని అరెస్టు చేసిన పోలీసులు ఆ తర్వాత కృస్ణంరాజునూ అరెస్టు చేశారు. ఇప్పుడు వారిద్దరూ గుంటూరు జిల్లా జైలులో ఉన్నారు.
కొమ్మినేనికి బెయిల్ వచ్చినా… సుప్రీంకోర్టు నుంచి సదరు ఉత్తర్వులు ఆ రోజే ట్రయల్ కోర్టుకు రావాల్సి ఉంది. అయితే శుక్రవారం సాయంత్రం దాకా ఆ ఉత్తర్వులు ట్రయల్ కోర్టుకు రాలేదు. ఇక శనివారం రెండో శనివారం కావడంతో సెలవు దినంగా పరిగణిస్తూ కోర్టులు పని చేయలేదు. ఆదివారం అన్నింటికీ సెలవే. ఇక సోమవారం అయినా సుప్రీంకోర్టు నుంచి బెయిల్ ఉత్తర్వులు వచ్చినా.. ట్రయల్ కోర్టు నుంచి సవివర నిబంధనలు రూపొంది.. బెయిల్ ఆదేశాలు విడుదల అవుతాయా? లేదా? అన్న దానిపై స్పష్టత లేదు.
శుక్రవారం కొమ్మినేనిని బెయిల్ రాగానే… వైసీపీ నేతలు సంబరపడ్డారు. ఇక శుక్రవారం సాయంత్రానికి కొమ్మినేని బయటకు వచ్చేస్తారని వారు సంబరాలు చేసుకున్నారు. అయితే వైసీపీ లీగల్ టీం మాత్రం అటు సుప్రీంకోర్టు వద్ద, ఇటు ట్రయల్ కోర్టు వద్ద పడిగాపులు కాసింది. అయినా బెయిల్ ఉత్తర్వులు విడుదల కాలేదు. ఈ నేపథ్యంలో ఎలాగైనా సోమవారం కొమ్మినేనికి సంబంధించిన బెయిల్ ఉత్తర్వులను సంపాదించి… ఆయనను జైలు నుంచి బయటకు తీసుకు వచ్చేలా ఆ బృందం శ్రమిస్తోంది. మరి వారి కృషి ఫలిస్తుందో, తిరిగి మంగళవారానికి వాయిదా పడుతుందో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates