గాడ్ ఫాద‌ర్‌-గేమ్ చేంజ‌ర్‌-రింగ్ మాస్ట‌ర్‌.. విష‌యం ఏంటంటే!

ఇవేవీ సినిమా పేర్లు కాదు. ఏపీలో పాల‌న‌కు సంబంధించి ముగ్గురు కీల‌క నాయ‌కుల‌ను ఉద్దేశించి ఓ మ‌హిళా ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్య‌లు. అయితే.. ఇవి సోష‌ల్ మీడియాలో జోరుగా వైర‌ల్ అవుతుండ‌డం గ‌మ‌నార్హం. తాజాగా రాష్ట్రంలో త‌ల్లికి వంద‌నం పేరుతో కీల‌క‌మైన సూప‌ర్ – 6 ప‌థ‌కాల‌కు ప్ర‌భుత్వం శ్రీకారం చుట్టింది. దీనిలో భాగంగా రూ.13000 చొప్పున ఎంత మంది పిల్ల‌లు ఉంటే అంత‌మందికీ ఇస్తున్నారు. అయితే.. రూ.15 వేలు ఇస్తామ‌ని. 13 వేలు ఇవ్వ‌డం ఏంట‌న్న‌ది వైసీపీ నుంచి వ‌చ్చిన  ప్ర‌శ్న‌. ఈ 2 వేల సొమ్మును మంత్రి నారా లోకేష్ నొక్కేస్తున్నార‌ని కూడా ఆపార్టీ నాయ‌కులువిమ‌ర్శ‌లు గుప్పించారు.

దీంతో రాష్ట్ర వ్యాప్తంగా నాయ‌కులు వైసీపీపై విరుచుకుప‌డ్డారు. మంత్రుల నుంచి ఎమ్మెల్యేల వ‌ర‌కు కూడా పెద్ద ఎత్తున విమ‌ర్శ లు గుప్పించారు. మ‌రోవైపు.. నారా లోకేష్ చేసిన స‌వాల్‌ను స్వీక‌రించే ద‌మ్ము కూడా వైసీపీనాయ‌కుల‌కు లేకుండా పోయింద‌ని టీడీపీ మంత్రులు ఒక‌రిద్ద‌రు ద‌య్య‌బ‌ట్టారు. అలాగే.. గ‌త వైసీపీ ప్ర‌భుత్వం ఒక్కొక్క కుటుంబానికి ఏటా రూ.30 వేల చొప్పున మాత్ర‌మే అందించింద‌ని.. కానీ బాబు ప్ర‌భుత్వం ల‌క్ష రూపాయ‌ల పైచిలుకు అందిస్తోందని మంత్రులు చెప్పుకొచ్చారు. ఈ క్ర‌మంలో ఆళ్లగ‌డ్డ ఎమ్మెల్యే, మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ స్పందిస్తూ.. వైసీపీపై నిప్పులు చెరిగారు. త‌ల్లిని చెల్లిని ఎగ్గొట్టిన జ‌గ‌న్‌కు మ‌హిళ‌ల క‌ష్టాలు ఏం తెలుస్తాయ‌ని ప్ర‌శ్నించారు.

పార్టీ కోసం.. త‌ల్లిని, చెల్లిని కూడా.. జ‌గ‌న్ వాడుకున్నార‌ని.. అదికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత వారిని త‌రిమేశార‌ని వ్యాఖ్యానించా రు. ఈ క్ర‌మంలోనే రాష్ట్రంలో ముగ్గురు నాయ‌కులు ఉన్నారు.. వారు గాడ్ ఫాద‌ర్‌-గేమ్ ఛేంజ‌ర్‌-రింగ్ మాస్ట‌ర్‌.. అంటూ.. అఖిల ప్రియ చెప్పుకొచ్చారు. సీఎం చంద్ర‌బాబు రాష్ట్రానికి ల‌భించిన గాడ్ ఫాద‌ర్ అని చెప్పారు. ఆయ‌న వ‌ల్లే రాష్ట్రం అభివృద్ది ప‌థంలో ముందుకు సాగుతోంద‌న్నారు. ఒక‌వైపు సంక్షేమం.. మ‌రోవైపు అభివృద్ధిని కూడా ముందుకు తీసుకువెళ్తున్నార‌ని కొనియాడా రు. ఇక‌, డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌ను గేమ్ చేంజ‌ర్‌తో పోల్చారు. అదేవిధంగా మంత్రి నారా లోకేష్.. `రింగ్ మాస్ట‌ర్` మాదిరిగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని పేర్కొన్నారు. ప్ర‌స్తుతం భూమా అఖిల ప్రియ చేసిన‌వ్యాఖ్య‌లు సోష‌ల్ మీడియాలో జోరుగా వైర‌ల్ అవుతుండ‌డం గ‌మ‌నార్హం.