కవిత ఇంటి పేరు మార్చుకున్నారా..?

kavitha

తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా సాధించిన భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుమార్తె గానే కాకుండా పార్టీ సాంస్కృతిక విభాగం తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలు, ఆ సంస్థ అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీగా కొనసాగుతున్న కవిత ఇంటి పేరు ఏమిటి? కల్వకుంట్ల కవితే కదా అంటారా? ఇప్పటిదాకా అయితే ప్రతి ఒక్కరూ ఆమెను కల్వకుంట్ల కవితగానే పిలుస్తున్నారు. దాదాపుగా అన్ని మీడియా సంస్థలూ అదే రాస్తున్నాయి కూడా. సడెన్ గా శనివారం ఓ మీడియా సంస్థ కవిత ఇంటి పేరును మార్చేసింది. కల్వకుంట్ల కవితకు బదులుగా దేవనపల్లి కవిత అని పేర్కొంది.

కేసీఆర్ కు ఇద్దరు పిల్లలు. తొలి సంతానం కుమారుడు కేటీఆర్ కాగా.. రెండో సంతానం కవిత. కేటీఆర్, కవితలకు కేసీఆర్ ఎప్పుడో పెళ్లిళ్లు చేశారు. కేటీఆర్ శైలిమను పెళ్లి చేసుకోగా… కవిత అనిల్ కుమార్ ను పెళ్లి చేసుకున్నారు. ఈ రెండు జంటలు అమెరికాలో చాలా కాలం పాటు ఉద్యోగాలు చేస్తూ సాగాయి. అయితే తెలంగాణ ఉద్యమం పతాక స్థాయికి చేరిన సమయంలో అటు కేటీఆర్ తో పాటు ఇటు కవిత కూడా అమెరికాను వీడి తెలంగాణ వచ్చేశారు. పార్టీలో మమేకమై ఉద్యమంలో ముందుండి నడిచారు. కేసీఆర్ మార్గదర్శకత్వంలో ఉద్యమాన్ని ఉర్రూతలూగించారు.

ఇక్కడి దాకా బాగానే ఉన్నా… బీఆర్ఎస్ ఎప్పుడైతే అధికారం కోల్పోయిందో… అప్పుడే అన్నాచెల్లెళ్ల మధ్య అబిప్రాయ బేధాలు పొడచూపాయి. ఇక మొన్నటి కవిత లేఖ బహిర్గతం కావడంతో ఈ విభేదాలు మరింతగా పెరిగాయి. ఇలాంటి నేపథ్యంలో సొంతంగానే ప్రస్థానం సాగించేలా కవిత ప్లాన్ చేసుకుంటున్నారన్న వార్తలు వినిపించాయి. అయితే తెలంగాణ జాగృతి కార్యాలయాన్ని తన ఇంటికి సమీపంలోకి మార్చుకున్న కవిత… తన సత్తాను చూపే దిశగా అడుగులు వేయడం ప్రారంభించారు. ఈ కార్యక్రమాల్లో కవితకు ఆమె భర్త అనిల్ చేదోడువాదోడుగా నిలిచారు.

సరే… తాజాగా శనివారం తెలంగాణ జాగృతి కార్యాలయంలో పలువురు యువకులు ఆ సంస్థలో చేరారు. వారికి సంస్థ కండువాలు కప్పిన కవిత..వారిని పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఓ మీడియా సంస్థ కవిత పేరును కల్వకుంట్ల కవితగా కాకుండా దేవనపల్లి కవితగా రాసింది. అనిల్ ఇంటిపేరు దేవనపల్లి. ఓ కెమికల్ ఇంజినీర్ అయిన అనిల్ ఏనాడూ రాజకీయాల జోలికి రాలేదు. అయితే కవిత ఒంటరి పోరు మొదలుపెడితే మాత్రం ఆయన కూడా రాజకీయంగా యాక్టివ్ అవుతారన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా మీడియా సంస్థలు చిన్నగా కవిత ఇంటి పేరును కల్వకుంట్ల నుంచి దేవనపల్లి కవితగా మార్చే దిశగా అడుగులు వేస్తున్నాయి.