ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన రేవంత్ రెడ్డి

తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి శుక్రవారం రాత్రి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త చెప్పారు. ఉద్యోగులకు ఇస్తున్న డీఏను 3.64 శాతం పెంచుతున్నట్లుగా రేవంత్ సర్కారు శుక్రవారం రాత్రి ఏకంగా అధికారిక ఉత్తర్వులే జారీ చేసింది. అంతేకాకుండా ఈ పెంచిన డీఏను కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ఏడాది ముందు నుంచి వర్తింపజేస్తామనీ ఆ ఉత్తర్వుల్లో రేవంత్ సర్కారు మరింత గుడ్ న్యూస్ చెప్పింది. 2023 జనవరి 1 నుంచి ఈ పెంచిన డీఏను చెల్లిస్తామని ప్రభుత్వం వెల్లడించింది.

రేవంత్ రెడ్డి సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత దాదాపుగా అన్ని వర్గాలు కాంగ్రెస్ సర్కారు వైపు ఆశగా ఎదురు చూశారు. అయితే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ఒక్కొక్కటిగానే పట్టించుకుని వాటిని పరిష్కరించే దిశగా చిన్నచిన్నగానే సాగుతోంది. ఉద్యోగులు తమ సమస్యల పరిష్కారం నిమిత్తం ప్రభుత్వంతో పలు దఫాలుగా చర్చల కోసం యత్నించారు. ఈ క్రమంలో మొన్ననే డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కతో కలిసి రేవంత్ రెడ్డి ఉద్యోగులతో సమగ్రంగా చర్చలు జరిపారు. ఈ చర్చల్లోనే ఉద్యోగులకు సంబంధించిన కొన్ని సమస్యల పరిష్కారానికి రేవంత్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.

ఉద్యోగ సంఘాలు కోరినంత కాకున్నా…రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సహకరించినంత మేర డీఏ పెంపునకు రేవంత్ సర్కారు సమ్మతించింది. అందులో భాగంగా ఉద్యోగుల డీఏ ను 3.64 శాతం పెంచుతూ రేవంత్ సర్కారు శుక్రవారం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వుల్లో డీఏ పెంపు 2023 జనవరి 1 నుంచి అమలు చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించడంతో ఉద్యోగుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఈ చర్యతో ఉద్యోగుల్లోనూ రేవంత్ మంచి మార్కులు రాబట్టినట్లుగా విశ్లేషణలు సాగుతున్నాయి.