జగన్ మాటల కన్నా కూటమి చర్యలే బలంగా మారాయి

త‌మ‌ హ‌యాంలో మాత్ర‌మే సంక్షేమ ప‌థ‌కాలు అమ‌ల‌య్యాయ‌ని.. కూట‌మి ప్ర‌భుత్వం ప్ర‌జ‌ల‌ను ఏమార్చింద‌ని వైసీపీ అధినేత‌, మాజీ సీఎం జ‌గ‌న్ ఇటీవ‌ల కాలంలో ప‌దే ప‌దే చెబుతున్నారు. రాష్ట్రంలో కూట‌మి ప్ర‌భుత్వం ఏర్ప‌డి ఏడాది పూర్త‌యిన నేప‌థ్యంలో ఆయ‌న ‘వెన్నుపోటు దినం’ పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా నిర‌స‌న‌లు కూడా చేయించారు. సంక్షేమానికి కేరాఫ్ తామేన‌ని కూడా ప్ర‌క‌టించారు. ముఖ్యంగా అమ్మ ఒడి వంటి కీల‌క ప‌థ‌కాల‌ను తాము త‌ప్ప ఇత‌రులు అమ‌లు చేయ‌లేర‌ని చెప్పారు.

అయితే.. జ‌గ‌న్ హ‌యాంలో సంక్షేమం జ‌రిగింది. కానీ, ఇది నాణేనికి ఒక‌వైపు మాత్ర‌మే. మ‌రి రెండో వైపు మాటేంటి? అంటే.. స‌మాధానం లేదు. ఎందుకంటే.. సంక్షేమంతోపాటు.. అభివృద్ధి కూడా ముఖ్య‌మే. క‌డుపు నిండా అన్నం పెడుతున్నామ‌ని.. క‌ట్టుకునేందుకు బ‌ట్ట‌లు లేకుండా చేస్తే ఎలా?.. ఇది కూడా అంతే. సంక్షేమం అమ‌లు చేస్తున్న పేరుతో అభివృద్ధిని విస్మ‌రించారు. ర‌హ‌దారుల‌పై నిలువెత్తు గోతులు ప‌డినా.. జ‌గ‌న్ ఒక్క‌సారి కూడా స‌మీక్షించ‌లేదు. స‌రిచేసే ప్ర‌య‌త్నం కూడా చేయ‌లేదు.

ఇక‌, ఇత‌ర అభివృద్ధి కార్య‌క్ర‌మాలైన పోల‌వ‌రం ప్రాజెక్టు, వెనుక బ‌డిన జిల్లాల్లో ప‌రిశ్ర‌మ‌లు.. తీసుకురావడం, పెట్టుబ‌డులు వ‌చ్చేలా చేయ‌డం అనేది లేకుండా పోయింది. కానీ.. ప్రస్తుతం కూట‌మి స‌ర్కారు రెండింటిని స‌మ‌పాళ్ల‌లో ముందుకు తీసుకువెళ్తోంది. అభివృద్ధికి మాత్ర‌మే ప్రాధాన్యం ఇవ్వ‌డం కాదు.. సంక్షేమానికి కూడా పెద్ద‌పీట వేసింది. పింఛ‌న్ల నుంచి క్యాంటీన్ల వ‌ర‌కు.. గ్యాస్ సిలిండ‌ర్ల నుంచి త‌ల్లికి వంద‌నం వ‌ర‌కు.. అన్నింటినీ ఏడాదికాలంలో పూర్తి చేసింది.

దీంతో జ‌గ‌న్ త‌ప్ప చేయ‌లేరని వైసీపీ నాయ‌కులు చెప్పిన మాటలు ఇప్పుడు బుట్ట‌దాఖ‌ల‌య్యాయి. జ‌గ‌న్ టాపిక్ కూడా.. రాష్ట్రంలో లేకుండా పోతోంది. సంక్షేమం పేరుతో కూట‌మి స‌ర్కారు డ‌బ్బులు ఇవ్వ‌డంతో పాటు.. మ‌రోవైపు.. విజ‌న్ 2047 పేరుతో అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌కు కూడా శ్రీకారం చుట్టింది. అమరావ‌తిని ప‌రుగులు పెట్టిస్తోంది. పోల‌వ‌రం పూర్తి చేసేందుకు ల‌క్ష్యం పెట్టుకుంది. ర‌హ‌దారుల‌ను నిర్మించింది. తాజాగా త‌ల్లికి వంద‌నం పేరుతో నిధులు విడుద‌ల చేసింది. దీంతో ఇప్పుడు జ‌గ‌న్ టాపిక్ లేకుండా పోయింది.