ఆఫ్ట‌ర్ వ‌న్ ఇయ‌ర్‌.. వైసీపీ ఓటు బ్యాంకు త‌గ్గిందా.. పెరిగిందా..?

గ‌త ఏడాది ఎన్నిక‌ల్లో వైసీపీకి 40 శాతానికి అటు ఇటుగా ఓటు బ్యాంకు వ‌చ్చింది. ఇది పార్టీ ఓడిపోయిన‌ప్ప టికీ.. అస‌లు పార్టీలో జ‌వ‌స‌త్వాలు త‌గ్గ‌లేద‌ని చెప్ప‌డానికి.. పార్టిక ప్ర‌జ‌లు అండ‌గా ఉన్నార‌ని అనేందుకు ఒక ఉదాహ‌ర‌ణ‌. అయితే.. ఎన్నిక‌ల అనంత‌రం ఏడాది త‌ర్వాత‌.. ప్ర‌స్తుతం వైసీపీ ఓటు బ్యాంకు త‌గ్గిందా? పెరిగిందా? అనేది కీల‌క అంశం. ఎప్ప‌టిక‌ప్పుడు కొలుచుకునే సంస్కృతి వైసీపీకి లేక‌పోయినా.. రాజ‌కీయ వ‌ర్గాల్లో మాత్రం వైసీపీపై భారీ అంచ‌నాలు.. లెక్క‌లు క‌నిపిస్తున్నాయి.

ఈ ప‌రంగా చూసుకుంటే.. వైసీపీకి ఓటు బ్యాంకు స్థిరంగా లేద‌న్న విష‌యం తెలుస్తోంది. తాజాగా కొంద‌రు చేసిన స‌ర్వేలే కాకుండా.. టీడీపీ అనుకూల వ‌ర్గాలు చేయించిన స‌ర్వేల్లోనూ.. వైసీపీ ఓటు బ్యాంకు స్థిరంగా లేద‌ని తెలుస్తోంది. గత ఏడాది 40 శాతం ఓటు బ్యాంకుతో ప్ర‌తిప‌క్షానికి ప‌రిమిత‌మైన వైసీపీ.. కేవ‌లం 4-5 శాతం ఓటు బ్యాంకు తేడాతోనే అధికారం కోల్పోయింది. మ‌రి ఆ మేర‌కు ప్ర‌స్తుతం ఓటు బ్యాంకు పెరిగిందా? అంటే సందేహ‌మే. ఎందుకంటే. ఏడాదిలో వైసీపీ పెద్ద‌గా పుంజుకోలేదు.

పైగా.. ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై బ‌ల‌మైన ఉద్య‌మం నిర్మించ‌డంలోనూ.. విఫ‌ల‌మైంది. ప్ర‌జ‌ల త‌ర‌ఫున గ‌ళం వినిపించ‌డం లోనూ.. పార్టీ వెనుక‌బ‌డింది. ఇవ‌న్నీ ఇలా ఉంటే.. జ‌గ‌న్ వ్య‌వ‌హ‌రించిన తీరు కూడా.. ప్ర‌జలు ఏవ‌గించుకునే ప‌రిస్థితిని తీసుకువ‌చ్చింది. అసెంబ్లీకి వెళ్ల‌కుండా మంకు ప‌ట్టు ప‌ట్ట‌డం.. మెజారిటీ ప్ర‌జ‌ల‌కు విస్మ‌యం క‌లిగించ‌డంతోపాటు..”ఈయ‌న మార‌డు” అనేది జ‌గ‌న్‌కు ప‌డి ముద్ర‌గా మారింది. వాస్త‌వానికి.. ఎన్నిక‌ల అనంత‌రం మార్పు త‌ధ్య‌మ‌ని అనుకున్నారు.

కానీ, ఆ మార్పు జ‌గ‌న్‌లో ఎక్క‌డా క‌నిపించ‌లేదు. పైగా.. నాయ‌కులు వీడిపోవ‌డం.. పార్టీలో లుక‌లుక‌లు.. ఎన్నిక‌ల అనంత‌రం.. అంద‌రూ జ‌గ‌న్ వైపే త‌ప్పులు చూపించ‌డం వంటివి కూడా పార్టీని జారుబండ‌పై కూర్చోబెట్టాయి. మ‌రోవైపు.. ఏ స‌మ‌స్య‌ను కూడా.. ఆయ‌న ప్ర‌జ‌ల మ‌ద్య‌కు కాకుండా.. కేవ‌లం సోష‌ల్ మీడియాను మాత్ర‌మే న‌మ్ముకుని ముందుకు రావ‌డం గ‌మ‌నార్హం. దీంతో వైసీపీ గ్రాఫ్ క‌న్నా కూడా.. ఓటు బ్యాంకు ప్ర‌స్తుతం 2-4 శాతం మేర‌కు త‌గ్గింద‌న్న‌ది తాజా అంచ‌నా. ఇది పెద్ద‌ది కాద‌ని వైసీపీ మౌనంగా ఉంటే.. మున్ముందు.. వాటి ప‌క్క‌న సున్నాలు చేరినా ఆశ్చ‌ర్యంలేదు.