ప్రముఖ గాయకురాలు మంగ్లీ తన పుట్టిన రోజు సందర్భంగా మంగళవారం రాత్రి రంగారెడ్డి జిల్లా చేవెళ్ల పరిధిలోని ఓ రిసార్ట్‌లో తన స్నేహితులను పిలిచి పార్టీ ఇచ్చారు. అయితే.. ఇది టీ పార్టీనో.. మందు పార్టీనో అయితే.. ఏమయ్యేదో ఏమో.. కానీ, ఆ పార్టీలో గంజాయి గుప్పుమంది. దీంతో ఈ వ్యవహారం రచ్చకెక్కింది. అంతేకాదు.. డ్రగ్స్ తీసుకున్నారన్న చర్చ కూడా మొదలైంది. ఇప్పటి వరకు మంగ్లీ అంటే.. తెలంగాణ సమాజంలో `గుడ్ సింగర్`, `జెన్యూన్ పర్సనాలిటీ` అనే పేరుంది. ఈ ఘటన తర్వాత.. ఆమెపై విమర్శలు.. మూతి బిగింపులు, పెదవి విరుపులు సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి.
ఇక, పోలీసుల ఎంట్రీతో ఈ వ్యవహారం మరింత సీరియస్ అయింది. కేసుల వరకు కూడా చేరింది. ఇదిలావుంటే.. మంగ్లీ ఎఫెక్ట్ ఆమెతోనో.. ఆమె స్నేహితులతోనో లేక ఈ పార్టీకి వేదిక అయిన రిసార్ట్‌తోనో పోలేదు. ఏకంగా `పెద్దల`కు కూడా చుట్టుకుంది. తాజాగా తెలంగాణ పోలీసులు పెద్దలను ఉద్దేశించి సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. తేడా వస్తే.. లాఠీలు విరుగుతాయన్నట్టుగా భారీ మెసేజే పెట్టారు. ఎంతటివారినైనా ఉపేక్షించేది లేదని తేల్చి చెప్పారు. ఎంతటి ప్రముఖులైనా డ్రగ్స్ లాంటి మత్తు పదార్థాలు వాడితే కఠిన చర్యలు తీసుకుంటామని తెలంగాణ పోలీసు ఉన్నతాధికారులు తమ అధికారిక ‘ఎక్స్’ ఖాతాలో పోస్టు పెట్టారు.
నిజానికి హైదరాబాద్‌లో గత కేసీఆర్ హయాంలోనే పెద్ద ఎత్తున డ్రగ్స్ వ్యవహారం వెలుగు చూసింది. అప్పట్లో ఐపీఎస్ అధికారి నేతృత్వంలో పెద్ద ఎత్తున సినీ ప్రముఖులను కూడా పిలిచి విచారించారు. అనేక మంది టెస్టులు కూడా చేశారు. ఆ తర్వాత.. ఏమైందో ఏమో.. ఆ కేసులు మరుగున పడ్డాయి. తర్వాత కాంగ్రెస్ హయాంలోనే అడపా దడపా కేసులు నమోదవుతూనే ఉన్నాయి. అయితే.. సీఎం రేవంత్ రెడ్డి మాత్రం డ్రగ్స్ వినియోగించేవారికి అదే చివరి రోజు అవుతుందని.. దీనిపై ఉక్కుపాదం మోపుతున్నామని గతంలో ప్రకటించారు. దీని ప్రకారం పోలీసులు కూడా చర్యలు తీసుకుంటున్నారు.
డ్రగ్స్ వినియోగమే కాదు.. వీటిని కలిగి ఉన్న వారిపైనా కేసులు పెట్టి.. డ్రగ్స్ చట్టాల కింద కేసులు నమోదు చేస్తున్నారు. ప్రతి విషయాన్నీ సీరియస్‌గా తీసుకుంటున్నారు. ఈ క్రమంలో చాలా రోజుల తర్వాత.. మంగ్లీ ఏర్పాటు చేసిన విందు పార్టీలో మరోసారి గంజాయి కలకలం రేగడం.. డ్రగ్స్ కూడా వినియోగించారన్న వార్తలు రావడంతో పోలీసులు అలెర్ట్ అయ్యారు. ఈ విషయంలో `పెద్దలనే`వారు టార్గెట్ చేస్తూ.. సీరియస్ వార్నింగ్ ఇవ్వడం గమనార్హం. మరి ఈ వ్యవహారంతో అయినా.. మార్పు కనిపిస్తుందేమో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates