తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. బుధవారం ఉదయం కాళేశ్వరం కమిషన్ ఎదుట హాజరయ్యారు. బీఆర్కే భవన్‌లో జరిగిన ఈ విచారణకు భారీ ఎత్తున మందీ మార్బలంతో వచ్చినప్పటికీ.. అధికారులు కేవలం కేసీఆర్, ఒక స్టెనో.. మరో అధికారిని మాత్రమే అనుమతించారు. ఇక, అప్ప టికే అక్కడకు చేరుకున్న బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు.. నినాదాలతో హోరెత్తించారు.
ఇక, కమిషన్ చైర్మన్ పీసీ ఘోష్… సుమారు 50 నిమిషాల పాటు కేసీఆర్‌ను ప్రశ్నించారు. మొత్తంగా 20 ప్రశ్నలు సంధించినట్టు సమాచారం. దీనిలో ప్రధానంగా కాళేశ్వరం ప్రాజెక్టు రీడైజన్ సహా.. నిధుల వ్యయం పెంపు వంటి కీలక ప్రశ్నలు సంధించారు. అదేవిధంగా కేబినెట్‌లో తీసుకున్న నిర్ణయాలపైనా అడిగారని తెలిసింది. ఈ ప్రాజెక్టు రూపకల్పన వెనుక జరిగిన పరిణామాలను.. తెలంగాణ రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఈ సందర్భంగా కేసీఆర్ కమిషన్‌కు వివరించారు.
అదేవిధంగా తనతోపాటు తీసుకువెళ్లిన డాక్యుమెంట్లను కొన్ని పత్రాలను కూడా కేసీఆర్ కమిషన్‌కు అందించారు. తన ప్రమేయం ఏమీలేదని.. రైతులకు ఉపయోగపడాలని.. తెలంగాణ బిడ్డలు బాగుండాలన్న ఉద్దేశంతోనే ఈ ప్రాజెక్టును చేపట్టినట్టు వివరించారు. దీనికి సంబంధించిన ఆధారాలను కూడా ఆయన పేర్కొన్నారు. కాగా, కమిషన్ విచారణలో కేసీఆర్ ఇప్పటికే 114 మందిని విచారించిన విషయం తెలిసిందే. కేసీఆర్‌ను 115వ సాక్షిగా పిలిచింది.
అయితే.. తొలుత దీనిపై ‘ఇన్ కెమెరా’ విచారణ సాగుతుందని అనుకున్నా.. నేరుగా కమిషన్ ముందుకే కేసీఆర్ హాజరయ్యారు. 50 నిమిషాల విచారణలో పలు ప్రశ్నలకు కేసీఆర్ గుర్తులేదని కూడా సమాధానం చెప్పినట్టు తెలిసింది. ఇక, విచారణ ముగిసిన తర్వాత.. ఆయన బీఆర్ఎస్ భవన్‌కు వస్తారని అనుకున్నారు. కానీ, అనూహ్యంగా కేసీఆర్.. తన ఎర్రవెల్లి ఫామ్ హౌస్‌కే వెళ్లిపోయారు. ఇక ఈ కేసులో ఇప్పటికే మాజీ మంత్రులు హరీష్‌రావు, ఈటల రాజేందర్‌లను విచారించిన విషయం తెలిసిందే.