అమరావతి రాజధానిలో నివసించే మహిళలపై అవాకులు, చవాకులు పేలిన సీనియర్ జర్నలిస్టు ఆర్ వీవీ కృష్ణంరాజుపై గుంటూరు జిల్లా తుళ్లూరు పోలీసులు కేసులు నమోదు చేశారు. తమ మనోభావాలు దెబ్బతిన్నాయంటూ.. కంభంపాటి శిరీష ఇచ్చిన ఫిర్యాదు మేరకు.. పోలీసులు కేసు పెట్టారు. అమరావతి మహిళలను ‘ఆ తరహా’ మహిళలతో పోల్చడాన్ని సహించలేకపోతున్న మహిళలు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేస్తున్నారు. సాక్షి కార్యాలయాల వద్ద ధర్నాలు, నిరసనలు కూడా వ్యక్తం చేస్తున్నారు.
ఈ క్రమంలో పోలీసులు కూడా ఈ విషయాన్ని చాలా సీరియస్‌గా తీసుకున్నారు. ఇప్పటికే యాంకర్ కొమ్మినేని శ్రీనివాసరావును అరెస్టు చేశారు. జైలుకు తరలించారు. ఈ కేసులో ఏ-1గా ఉన్న కృష్ణంరాజు కోసం వెతుకుతున్నారు. విజయవాడ స్థానికుడైన కృష్ణంరాజు.. ఈ కేసు నమోదైన వెంటనే ఇంటికి తాళం వేసుకుని అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. దీంతో ఆయన కోసం పోలీసులు హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీలోనూ వెతుకుతున్నట్టు సమాచారం.
ఇదిలావుంటే.. అజ్ఞాతంలో ఉన్న కృష్ణంరాజు తనకు ముందస్తు బెయిల్ కావాలని కోరుతూ రాష్ట్ర హైకోర్టు లో పిటిషన్ వేశారు. తనను పోలీసులు అరెస్టు చేయకుండా ముందస్తు రక్షణ కల్పించాలని ఆయన కోర్టును వేడుకున్నారు. తనను అరెస్టు చేస్తే.. కొట్టడంతోపాటు.. చిత్రహింసలు కూడా పెడతారని ఆయన పేర్కొన్నారు. రౌడీషీట్ కూడా ఓపెన్ చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారని.. తాను అంత పెద్ద తప్పు ఏమీ చేయలేదన్నారు.
ఓ ఆంగ్ల పత్రికలో వచ్చిన కథనాన్ని మాత్రమే తాను ఉటంకించానని కృష్ణంరాజు తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ.. మంగళవారం పొద్దుపోయాక.. హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. తాను విచారణకు సహకరిస్తానని చెప్పారు. ఈ పిటిషన్‌పై బుధవారం విచారణ చేపట్టనున్నారు. ఇదిలావుంటే.. రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు గగ్గోలు పెడుతున్నా.. తమను తీవ్రంగా అవమానించారని చెబుతున్నా.. కృష్ణంరాజు మాత్రం కరగలేదు.
నేరుగా ‘క్షమాపణలు’ కూడా కోరకపోవడం గమనార్హం. పైగా ఆయన అజ్ఞాతం నుంచే ఓ వీడియో విడుదల చేశారు. దీనిలో తను చేసిన వ్యాఖ్యలను మరింత సమర్థించుకునే ప్రయత్నం చేశారు. దీనిపై కూడా ప్రభుత్వం, మహిళలు ఆగ్రహంతో ఉన్నారు. మరి హైకోర్టు ఎలాంటి ఆదేశాలు జారీ చేస్తుందో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates