అమరావతి వేశ్యల రాజధాని అంటూ జర్నలిస్ట్ కృష్ణంరాజు చేసిన కామెంట్లు దుమారం రేపిన సంగతి తెలిసిందే. దీంతో, సాక్షి మీడియాపై ఇటు టీడీపీ, జనసేన, బీజేపీ నేతలతో పాటు మహిళా సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కొన్ని చోట్ల సాక్షి పత్రిక ప్రతులను నిరసనకారులు తగులబెట్టారు. అదే క్రమంలో ఏలూరులోని సాక్షి ఆఫీసుపై కొందరు మహిళలు దాడి చేశారని, ఆఫీసులో ఫర్నిచర్ దగ్ధం చేశారని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. అయితే, దగ్దమైంది సాక్షి కార్యాలయం కాదని ఏలూరు డీఎస్పీ శ్రవణ్ కుమార్ తాజాగా వెల్లడించారు.
ఓ ఫర్నిచర్ షాపుకు చెందిన గోదాంలో మరమ్మతు ఫర్నిచర్ మాత్రమే దగ్దమైందని శ్రవణ్ కుమార్ తెలిపారు. అగ్ని ప్రమాదంలో ఆస్తి నష్టం జరిగిందని ఫర్నిచర్ షాప్ యజమాని తమకు ఫిర్యాదు చేశారని, దాని ఆధారంగా కేసు నమోదు చేశామని వెల్లడించారు. మంటలను అదుపు చేస్తున్న సమయంలో దెందులూరు నుంచి వచ్చిన మహిళలు అక్కడకు వచ్చారని తెలిపారు. ఆ ఘటన సమయంలో తీసిన వీడియోలలో ఆ విషయం స్పష్టమవుతోందని చెప్పారు.
ఆ అగ్ని ప్రమాదానికి, సాక్షి కార్యాలయానికి సంబంధం లేదని, ఆ మంటలు ఎగిసిపడుతున్న సమయంలో మహిళలు చేస్తున్న ర్యాలీ 200 మీటర్ల దూరంలో ఉందని వెల్లడించారు. ఆ అగ్ని ప్రమాదం సాక్షి ఆఫీసులోనే అంటూ దుష్ప్రచారం చేసేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. కొన్ని ఛానల్స్ లో వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవమని చెప్పారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates