ఏలూరు జిల్లాలోని ‘సాక్షి’ కార్యాలయానికి కొందరు దుండగులు నిప్పంటించారు. దీంతో భారీ ఎత్తున మంటలు ఎగిసి పడి.. ఫర్నిచర్ సహా.. పలు కీలకవస్తువులు, వాహనాలు కూడా దహనమయ్యాయి. అయితే.. ఈ ఘటనపై రెండు రకాల వాదనలు తెరమీదికి వచ్చాయి. ఇదంతా టీడీపీ తరఫున నిరసనల పేరుతో అరాచకాలకు దిగిన వారి పనేనని సాక్షి ప్రతినిధులు చెబుతు న్నారు. పోలీసులు కూడా అక్కడే ఉన్నా.. ఎవరినీ అదుపు చేయలేదని.. నిప్పు పెట్టి మంటలుఎగసేలా చేసినా.. కూడా పట్టిం చుకోలేదని ఆరోపించారు. బీరు బాటిళ్లను, పెట్రో బాటిళ్లను కూడా మంటల్లో వేసి.. మరింత రగిలే చేశారని ఆరోపించారు.
ఇక, ఈ వాదనలను టీడీపీ నాయకులు ఖండిస్తున్నారు. తాము శాంతి యుత నిరసనలకు మాత్రమే పిలుపునిచ్చామని.. మహిళలు ఆగ్రహించి.. నిరసన వ్యక్తం చేశారని.. తెలిపారు. కేవలం శాంతి యుతంగానే కార్యాలయం ముందు ధర్నా నిర్వహించినట్టు తెలిపారు. పైగా.. ఆందోళన ముగిసి, మహిళలు అక్కడ నుంచి వెళ్లిపోయిన తర్వాత.. ఈ ఘటన చోటు చేసుకుందన్నారు. దీనిలో ఆందోళన కారుల పాత్ర లేదని.. సాక్షి ఉద్యోగులే ఆందోళన కారుల ముసుగులో వచ్చి.. నిప్పు పెట్టి ఉంటారని అనుమానాలు వ్యక్తం చేశారు. ఇదంతా ఉద్దేశపూర్వకంగా సాక్షి యాజమాన్యమే చేయించినట్టు టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు.
మొత్తంగా చూస్తే.. ఏలూరులోని సాక్షి కార్యాలయం అయితే.. తగులబడింది. భారీ ఎత్తున మంటలు వ్యాపించాయి. పక్కనే కార్లు, వాహనాలు కూడా ఉండడంతో తీవ్ర ఆందోళన రేకెత్తింది. కానీ, పక్కనే పోలీసులు ఉన్నా.. అటు ఇటు పరిగెత్తారే తప్ప.. మంటలను ఆర్పేందుకు మాత్రం ప్రయత్నించలేదని.. ప్రత్యక్షంగా చూసిన వారు చెబుతున్నారు. దీనికి సంబంధించి పలు వీడియోలు కూడా.. సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. మరోవైపు సోమవారం కూడా.. అమరావతి రాజధాని మహిళలకు సంఘీభావంగా రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు, ఆందోళనలు చేపట్టినా.. ఎక్కడా నిప్పు పెట్టడం.. అరాచకాలు సృష్టించడం వంటివి చేయలేదు. కానీ, మంగళవారం అంతా సర్దుమణిగిపోతున్న సమయంలో అనూహ్యంగా సాక్షి ఆఫీసులో మంటలు రేగడం చర్చకు దారితీసింది.