తెలంగాణలో కొత్తగా ముగ్గురు మంత్రులను సీఎం రేవంత్ రెడ్డి తన క్యాబినెట్ లోకి తీసుకున్నారు. అయితే ఈ ప్రక్రియ అంతా కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కనుసన్నల్లోనే జరిగింది. సుదీర్ఘకాలంగా వాయిదా పడుతూ వచ్చిన మంత్రివర్గ విస్తరణకు ఎట్టకేలకు ఇటీవల ఫుల్ స్టాప్ పెట్టారు. ఎస్సీ సామాజిక వర్గం నుంచి వివేక్ వెంకటస్వామి, అడ్లూరి లక్ష్మణ్‌లను మంత్రివర్గంలోకి తీసుకున్నారు. అలాగే మరొకరికి కూడా అవకాశం కల్పించారు.
ఇంతవరకు బాగానే ఉన్నా ఇప్పుడు విపక్షాలకు అవకాశం ఇచ్చేలా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం వ్యవహరిస్తోం దన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎందుకంటే సహజంగా జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ లో మంత్రి వర్గం ఎంపిక వరకు పార్టీ అధిష్టానం చెప్పాల్సిందేనని ఒక ప్రచారం అయితే ఉంది. గతంలో కూడా ఇది అమలైంది. కానీ.. ఇప్పుడు తీసుకున్నది ముగ్గురిని అయినప్పటికీ వీరికి ఏఏ శాఖలు ఇవ్వాలి? అనే విషయం కూడా అధిష్టానమే నిర్ణయించాల్సిన పరిస్థితి రావడం విమర్శలకు దారి తీస్తోంది.
తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లారు. అక్కడ ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, పార్టీ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీతో ఆయన భేటీ అయ్యారు. ఈ భేటీలో తాజాగా తీసుకున్న ముగ్గురికి ఏఏ శాఖలు ఇవ్వాలి? వారికి ఏ ఏ బాధ్యతలు అప్పగించాలనే విషయంపై చర్చించటం గమనార్హం. దీనిపై ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ నాయకులు నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి. రాష్ట్ర ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వాన్ని కేంద్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు శాసిస్తున్నారని విమర్శలు గుర్తిస్తున్నారు.
నిజానికి రేవంత్ రెడ్డికి బాధ్యతలు అప్పగించినప్పుడు పూర్తిగా స్వేచ్ఛనిస్తున్నట్టు అప్పట్లో రాహుల్ గాంధీ ప్రకటించారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకులు కూడా రేవంత్ రెడ్డికి స్వేచ్ఛ ఇస్తున్నట్టు చెప్పుకొచ్చారు. కానీ తర్వాత పరిణామాలు మాత్రం మారుతూ వచ్చాయి. ప్రతి విషయానికి రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లడం అక్కడ చర్చించడం మళ్ళీ ఇక్కడికి రావడం, ఎక్కడి నుంచి జాబితాను తీసుకుని అక్కడికి వెళ్లడం అక్కడ నిర్ణయం తీసుకోవడం ఇక్కడ అమలు చేయడం ఇదే సరిపోతుంది.
ప్రతి విషయంలోనూ కేంద్రంలోని పెద్దల జోక్యం పెరుగుతుండటంతో స్థానికంగా రేవంత్ రెడ్డి గ్రాఫ్ ప్రమాదంలో పడే అవకాశం ఉందని విశ్లేషకులు కూడా చెబుతున్నారు. వాస్తవానికి విధానపరమైనటు వంటి నిర్ణయాల్లో కాంగ్రెస్ పార్టీ ఒకింత జోక్యం చేసుకున్నా పర్వాలేదని కానీ మంత్రివర్గంలో ఏ శాఖల కేటాయించాలో కూడా చర్చించడం అధిష్టానం చెప్పిన ప్రకారం రేవంత్ రెడ్డి వ్యవహరించడం అనేది సబబు కాదని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ పరిణామాలు ఇలాగే కొనసాగితే వచ్చే ఎన్నికల నాటికి పార్టీ పరిస్థితి ఇబ్బందిగా మారుతుందని కూడా హెచ్చరిస్తున్నారు.