ఏపీ రాజధాని అమరావతిలో ఆ తరహా మహిళలు ఉంటారంటూ.. వైసీపీ మీడియా సాక్షిలో ఓ వ్యాఖ్యాత చేసిన కామెంట్లపై మహిళాలోకం భగ్గు మంటోంది. దీనిపై పెద్ద ఎత్తున మహిళలు కూడా ఉద్యమాలకు దిగారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని సాక్షి కార్యాలయాలు వద్ద ఆందోళన నిర్వహించారు. యాంకర్ కొమ్మినేని శ్రీనివాసరావు అదేవిధంగా ఈ వ్యాఖ్యలు చేసిన కృష్ణంరాజులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ వేడి ఇంకా చల్లారలేదు.
అయితే ఈ వ్యవహారంపై పార్టీలకు అతీతంగా ఒక వైసీపీ తప్ప మిగిలిన నాయకులు అందరూ స్పందిస్తున్నారు. మహిళలపై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుపడుతున్నారు. ఇలాంటి సమయంలో రాష్ట్రంలో పర్యటించిన బిజెపి తెలంగాణ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కానీ ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి కానీ ఈ వ్యాఖ్యలపై స్పందించలేదు. పైగా అసలు తమకు తెలియనట్టే వ్యవహరించడంపై మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
బాధ్యతాయుతమైన కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులు అమరావతి రాజధాని మహిళలపై చేసిన వ్యాఖ్యలను ఖండించకపోవడం కనీసం తప్పు పట్టకపోవడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. నిజానికి బిజెపి నాయకులు ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని ఇటు రాష్ట్ర ప్రభుత్వం అటు మహిళలు కూడా కోరుకుంటున్నారు. తద్వారా సాక్షి ఛానల్ పై చర్యలు తీసుకోవాలని ఆశిస్తున్నారు.
కచ్చితంగా ఇలాంటి సమయంలో రాష్ట్రంలో పర్యటించిన నాయకులు ఈ వ్యవహారం పై మాట్లాడతారని అందరూ ఎదురు చూశారు. అయితే ప్రధానమంత్రి మోడీ పాలనపై ప్రశంసలు గుప్పించడానికి మాత్రమే పరిమితమయ్యారు తప్ప రాజధాని మహిళలపై సాక్షి మీడియా ఛానల్లో వచ్చిన వ్యాఖ్యలపై మాత్రం వారు స్పందించకపోవడం గమనార్హం. ఈ వ్యవహారంపై తక్షణమే స్పందించాలని బిజెపి ఇలాంటి వాటికి మద్దతిస్తుందా? లేక విభేదిస్తుందా? అనేది స్పష్టం చేయాలని అమరావతి మహిళలు కోరుతున్నారు.