హ‌రీష్‌రావుకు బిగ్ రిలీఫ్‌.. ఆ కేసు కొట్టివేత‌!

బీఆర్ ఎస్ నాయ‌కుడు, మాజీ మంత్రి హ‌రీష్ రావుకు హైకోర్టులో భారీ ఊర‌ట ల‌భించింది. గ‌తంలో ఆయ‌న పై న‌మోదైన కేసును హైకోర్టు కొట్టివేసింది. 2023 అసెంబ్లీ ఎన్నిక‌ల్లో హ‌రీష్ రావు.. త‌న ఆస్తులు, అప్పులు, కేసుల వివ‌రాల‌ను దాచి పెట్టార‌ని చ‌క్ర‌ధ‌ర్ గౌడ్ అనే వ్య‌క్తి ఆరోపించిన విష‌యం గుర్తుండే ఉంటుంది. అంతేకాదు.. ఈ వివరాల‌ను దాచి పెట్ట‌డం ద్వారా హ‌రీష్ రావు త‌ప్పులు చేశారని కూడా ఆరోపించారు. ఈ నేప‌థ్యంలోనే ఎన్నిక‌ల సంఘానికి కూడా ఫిర్యాదు చేశారు.

అయితే.. దీనిపై కోర్టును ఆశ్ర‌యించాల‌ని ఎన్నికల సంఘం సూచించింది. దీంతో చ‌క్ర‌ధ‌ర్ గౌడ్‌.. హైకోర్టును ఆశ్ర‌యించారు. ఎన్నిక‌ల పిటిష‌న్ దాఖ‌లు చేశారు. ఎన్నిక‌ల సంఘానికి సమ‌ర్పించిన అఫిడ‌విట్‌లో హ‌రీష్‌రావు త‌ప్పుడు లెక్కలు చూపించార‌ని.. ఆయ‌న ఆస్తుల‌ను అప్పుల‌ను కూడా దాచిపెట్టార‌ని వ్యాఖ్యానించారు. ఇక‌, కేసుల వివ‌రాల‌ను కూడా చూపించ‌లేద‌న్నారు. ఈ నేప‌థ్యంలో ఎన్నిక‌ల నియ‌మావ‌ళిని అనుస‌రించి.. హ‌రీష్ రావు ఎన్నిక‌ను ర‌ద్దు చేయాల‌ని కోరారు.

దీనిని విచారించిన హైకోర్టు.. హరీష్ రావును కూడా ప‌లుమార్లు విచార‌ణ‌కు పిలిచింది. దీనిపై ఎన్నికల సంఘం అభిప్రాయం కూడా తీసుకుంది. అయితే.. హ‌రీష్‌రావు వాస్త‌వాలే వెల్ల‌డించార‌ని.. ఇది రాజ‌కీయ దురుద్దేశ పూరిత కుట్ర మేరకే కేసును న‌మోదు చేశార‌న్న వాద‌న‌ల‌ను హైకోర్టు ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుంది. దీంతో కేసును తాజాగా కొట్టి వేస్తున్నట్టు ప్ర‌క‌టించింది. దీంతో హ‌రీష్‌రావుపై ఉన్న ఎన్నిక‌ల పిటిష‌న్ కొట్టివేసిన‌ట్టు అయింది. కాగా.. ఇదంతా వ్యూహాత్మ‌కంగా కాంగ్రెస్ పార్టీ చేయిస్తున్న పనేన‌ని హ‌రీష్‌రావు ఆరోపించారు.