మీడియా ఛానెళ్లకు ఇంటర్వ్యూలు ఇచ్చే సమయంలో, డిబేట్లలో పాల్గొనే సమయంలో వక్తలు ఆచితూచి మాట్లాడాల్సి ఉంటుంది. ఆ వక్త రాజకీయ నేత అయినా…జర్నలిస్ట్ అయినా..ఫిల్మ్ స్టార్ అయినా సరే…నోరు జారితే మూల్యం చెల్లించక తప్పదు. అయితే పొరపాటునో..గ్రహపాటునో టంగ్ స్లిప్ అయి ఉంటే…ఆ వెంటనే క్షమాపణలు చెప్పి ఆ వ్యవహారానికి పుల్ స్టాప్ పెట్టిన వారిని చూశాం. కానీ, జర్నలిస్ట్ కృష్ణంరాజు అమరావతి వేశ్యల రాజధాని అంటూ తాను చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను సమర్థించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా జాతీయ మహిళా కమిషన్ ఆయనకు షాకిచ్చింది.
మహిళలపై ఆయన చేసిన అసభ్యకర వ్యాఖ్యలపై మీడియాలో వచ్చిన కథనాల ఆధారంగా సుమోటోగా ఎన్ సీ డబ్ల్యూ తీసుకుంది. ఈ ప్రకారం ఏపీ డీజీపీకి ఎసీ డబ్ల్యూ ఛైర్ పర్సన్ విజయ రాహత్కర్ లేఖ రాశారు.
ఆయన చేసిన వ్యాఖ్యలపై ఎటువంటి చర్యలు తీసుకున్నారో తెలియజేస్తూ మూడు రోజుల్లో నివేదిక అందజేయాలని డీజీపీని ఆదేశించింది. అమరావతి ఉద్యమంలో మహిళలు కీలక పాత్ర పోషించారని, అటువంటి మహిళలను ఆయన అవమానించారని ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఏపీ రాజధాని అమరావతితో పాటు యావత్ మహిళా లోకం సిగ్గుతో తలదించుకునే రీతిలో కృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపాయి. అయినా సరే పశ్చాత్తాప పడని ఆయన…తన వ్యాఖ్యలను సమర్థించుకుంటున్న తీరు మరింత వివాదాస్పదంగా మారుతోంది. తనపై కేసులు నమోదవుతున్నా సరే…తన కామెంట్లను కవర్ చేసేందుకు పాత పేపర్ క్లిప్పింగులు చూపిస్తూ తాను తప్పు చేయలేదని నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ రకంగా చేయడం వల్ల ఆయన మరింత దిగజారి పోతున్నారని విమర్శలు వస్తున్నాయి.
దేశంలోని ప్రధాన నగరాలలో వ్యభిచారం చేస్తూ పట్టుబడడం, పోలీసులు తీసుకువెళ్లడం, కేసులు నమోదు కావడం సర్వ సాధారణం అని, అటువంటిది కేవలం అమరావతిలోనే జరుగుతోంది అన్న రీతిలో ఆయన హైలైట్ చేస్తూ ఏపీ పరువు తీస్తున్నారని ప్రజలు మండిపడుతున్నారు. కృష్ణం రాజు వంటి వారిని అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.