తెలంగాణ ప్రభుత్వం అనూహ్య నిర్ణయం తీసుకుంది. ఆర్టీసీ చార్జీలను భారీగా పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే.. ఈ నిర్ణయంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. వాస్తవానికి మహాలక్ష్మి పథకం కింద.. రాష్ట్రంలో గత 15 నెలలకుపైగానే ఉచిత ఆర్టీసీ బస్సును మహిళలకు అందుబాటులోకి తీసుకు వచ్చారు. అయితే.. దీనివల్ల చాలా నష్టాలు వస్తున్నాయన్నది ఆర్టీసీ యాజమాన్యం చెబుతున్న మాట. అయినప్పటికీ.. పంటిబిగువన ఆ భారాలను ప్రభుత్వం భరిస్తోంది.
ఇక, ఆ భారాలు మరింత పెరుగుతున్న నేపథ్యంలో తాజాగా ప్రజలపై భారాలు మోపేందుకు సర్కారు రెడీ అయినట్టు ప్రచారం జరుగుతోంది. సాధారణ బస్సు చార్జీలతోపాటు.. అన్ని రకాల పాసుల చార్జీలను కూ డా పెంచుతూ ఉత్తర్వులు ఇచ్చారు. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని కూడా చెప్పారు. మొత్తంగా నూటికి రూ.20 చొప్పున ధరలను పెంచడం గమనార్హం. తద్వారా.. సాధారణ, మధ్యతరగతి ప్రజలపై పెను భారమే పడనుందని తెలుస్తోంది.
ఇవీ.. ధరలు..
- రూ.1,150 ఉన్న ఆర్డినరీ పాస్ రూ.1,400కు పెరగనుంది.
- రూ.1,300 ఉన్న మెట్రో ఎక్స్‌ప్రెస్ పాస్ రూ.1,600కు చేరనుంది.
- రూ.1,450 ఉన్న మెట్రో డీలక్స్ పాస్ రూ.1,800కు పెరుగుతుంది.
- గ్రేటర్ హైదరాబాద్, గ్రీన్ మెట్రో ఏసీ పాస్ ధరలు కూడా 20 శాతం చొప్పున పెరగనున్నాయి.
ఏం జరుగుతుంది?
కారణాలు ఏవైనా ఇలా.. బస్సు చార్జీల ధరలను పెంచడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. మహిళల కు మాత్రమే ఉచితంగా బస్సులను పరిమితం చేశారు. కానీ, ఇదేసమయంలో ధరలు పెంచడంతో అన్ని వర్గాల్లో నూ సర్కారు తీరుపు అసంతృప్తి వ్యక్తమవుతోంది. ముఖ్యంగా ఇతర పథకాల అమలు విషయాన్ని పక్కన పెట్టిన ప్రభుత్వం ఇలా చార్జీల భారం మోపడం ఏంటనే చర్చ సోషల్ మీడియాలో మరింత ఎక్కువగాసాగుతుండడం గమనార్హం.