కూతురి ఆరోపణలపై ముద్రగడ ఏమన్నారంటే?

తన తండ్రి ముద్రగడ పద్మనాభం క్యాన్సర్ బారిన పడ్డారని, కానీ ఆయనకు సరైన చికిత్స అందించకుండా తన అన్నయ్య గిరి అడ్డు పడుతున్నాడని ఆరోపిస్తూ ముద్రగడ తనయురాలు క్రాంతి ఇటీవల పెట్టిన సోషల్ మీడియా పోస్టు సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ముద్రగడ క్యాన్సర్‌తో బాధ పడుతున్నట్లు ఇప్పటిదాకా ఎవరికీ తెలియదు. ఈ సంగతి ఆయన అభిమానులను ఆందోళనకు గురి చేసింది. పైగా ఆయనకు సరైన చికిత్స అందట్లేదని తెలిసేసరికి ఇంకా కంగారు పడ్డారు. ఐతే ఈ వ్యవహారంపై ఇప్పుడు ముద్రగడ పద్మనాభం స్వయంగా స్పందించారు. ఒక వీడియో ద్వారా స్పష్టతనిచ్చారు.

తన కూతురు చేసిన ఆరోపణల్లో ఏమాత్రం వాస్తవం లేదని ముద్రగడ పద్మనాభం స్పష్టం చేశారు. ఆమెతో తనకు చాలా ఏళ్లుగా మనస్ఫర్థలు ఉన్నాయని.. ఏడాదిగా అవి తీవ్రం అయ్యాయని ఆయన పేర్కొన్నారు. ఈ జన్మలోనే కాదు.. ఇంకెన్ని జన్మలు ఎత్తినా కూడా వారి గుమ్మం కూడా తొక్కనని ఆయన స్ఫష్టం చేశారు. తన చిన్న కొడుకు తనను పట్టించుకోవడం లేదన్నది తప్పుడు ప్రేలాపన అని.. అతను రాజకీయంగా ఎదగకుండా చూడాలని కొందరు అదేపనిగా ఏడుస్తున్నారని కూతురికి కౌంటర్ ఇచ్చారు పద్మనాభం. గిరి, అతడి మావయ్య మీద చేసిన ఆరోపణలన్నీ అవాస్తవాలని ఆయన పేర్కొన్నారు.

గిరి తనను చాలా బాగా చూసుకుంటున్నాడని.. రోజూ దగ్గరుండి సేవలు చేస్తున్నాడని.. తన కాళ్లు కూడా పడుతున్నాడని ముద్రగడ వెల్లడించారు. తమ కుటుంబం మీద ఇంకో కుటుంబం కొంత కాలంగా అదే పనిగా దాడి చేస్తోందని.. ఇరు కుటుంబాల మధ్య సంబంధాలు పూర్తిగా నిలిచిపోయాయని.. తనకు, తన చిన్న కొడుక్కి మధ్య మనస్ఫర్థలు పెంచి దూరం చేయాలని వాళ్లు ప్రయత్నం చేస్తున్నారని.. ఇలాంటి కుళ్ళు రాజకీయాలు మానుకోవాలని ఆయన అన్నారు. తన కొడుకునే కాక మనవడిని కూడా రాజకీయాల్లోకి తీసుకెళ్తానని.. వారిని ముఖ్యమంత్రి స్థాయికి తీసుకెళ్తానని.. తనపై ఎవరో ఏడుస్తున్నారని రాజకీయాలు వదిలిపెట్టనని ఆయన స్పష్టం చేశారు. తనకు వయసు రీత్యా కొన్ని అనారోగ్య సమస్యలు ఉన్నాయే తప్ప.. ఇంకేవీ లేవంటూ తనకు క్యాన్సర్ వచ్చినట్లు జరుగుతున్న ప్రచారాన్ని ఆయన ఖండించడం గమనార్హం.