బిగ్ బ్రేకింగ్: సాక్షి యాంకర్ కొమ్మినేని అరెస్టు!

సీనియ‌ర్ జ‌ర్న‌లిస్టు, సాక్షి మీడియాలో ఇన్‌పుట్ ఎడిట‌ర్‌గా ప‌నిచేస్తున్న యాంక‌ర్‌.. కొమ్మినేని శ్రీనివాస‌రావును ఏపీ పోలీసులు అరెస్టు చేశారు. హైద‌రాబాద్‌లోని ఆయ‌న నివాసానికి సోమ‌వారం ఉద‌యం వెళ్లిన పోలీసులు.. ఆయ‌న‌ను అరెస్టు చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు. ఆ వెంట‌నే ప్ర‌త్యేక వాహ‌నంలో ఆయ‌న‌ను విజ‌య‌వాడ‌కు త‌ర‌లించారు. అయితే..అరెస్టు సంద‌ర్భంగా కొమ్మినేనికి.. ఏపీ పోలీసుల‌కు వాగ్వాదం జ‌రిగింది.

త‌న‌ను ఎందుకు అరెస్టు చేస్తున్నారో చెప్పాల‌ని.. ఏపీ పోలీసుల‌ను ఆయ‌న ప్ర‌శ్నించారు. అయితే.. అదంతా తాము త‌ర్వాత చెబుతామ‌ని.. ముందు స్టేష‌న్‌కు రావాల‌ని పోలీసులు తేల్చి చెప్పారు. దీంతో వివాదం ఏర్ప‌డింది. ఎట్ట‌కేల‌కు 50 నిమిషాల‌కు పైగా ఈ వాగ్వాదం జ‌రిగిన ద‌రిమిలా.. కొమ్మినేనిని ప్ర‌త్యేక వాహ‌నంలో పోలీసులు విజ‌య‌వాడ‌కు త‌ర‌లిస్తున్నారు. కాగా.. సాక్షిలో అమ‌రావ‌తిపై చేసిన వ్యాఖ్య‌ల‌కు.. త‌న‌కు ఎలాంటి సంబంధం లేద‌ని కొమ్మినేని చెప్పారు.

త‌న‌ను అక్ర‌మంగా అరెస్టు చేస్తున్నార‌ని.. త‌న‌కు ఆ వ్యాఖ్య‌ల‌కు సంబంధం లేద‌న్నారు. తాను ఆవ్యాఖ్య‌లను ఖండిస్తున్న‌ట్టు తెలిపారు. మ‌రోవైపు.. అమ‌రావ‌తిపై వ్యాఖ్య‌లు చేసిన జ‌ర్నలిస్టు కృష్ణంరాజు  కోసం కూడా ప్ర‌త్యేక బృందాలు గాలిస్తున్నాయి. ప్ర‌స్తుతం ఆయ‌న హైద‌రాబాద్ నుంచి పారిపోయిన‌ట్టు స‌మాచారం. ఇదిలావుంటే.. రాష్ట్ర వ్యాప్తంగా ఉద్య‌మించిన మ‌హిళ‌లు.. ఆదివారం దాదాపు అన్ని జిల్లాల్లోనూ పోలీసుల‌కు కొమ్మినేని స‌మా కృష్ణంరాజుపై ఫిర్యాదులు చేసిన విష‌యం తెలిసిందే. దీంతో పోలీసులు రంగంలోకి దిగి.. కొమ్మినేనిని అరెస్టు చేశారు.