అదేదో సామెత చెప్పినట్టు… దొంగలు పడ్డ ఆరు నెలలకు కుక్కలు మొరిగాయట. అంతా అయిపోయింది. వైసీపీ చేతిలోని చాలా స్థానిక సంస్థలు కూటమి పార్టీల పరం అయిపోయాయి. ఇదంతా జరిగి నెలలు గడుస్తోంది. జనం కూడా ఈ విషయాలను మరిచిపోయారు. మరి ఈ విషయాలను జనానికి మళ్లీ గుర్తు చేయాలనుకున్నారో, ఏమో తెలియదు గానీ… ఆయా స్థానిక సంస్థల్లో తమకు జెల్ల కొట్టిన నేతలపై వైసీపీ తాజాగా సస్పెన్షన్ వేటు వేసింది. ఈ మేరకు ఆదివారం వైసీపీ తీసుకున్న ఈ నిర్ణయంపై సర్వత్రా చర్చ నడుస్తోంది.
ఏపీలో విశాఖ, గుంటూరు, తిరుపతి వంటి కీలక కార్పొరేషన్లలో పాలక వర్గాలు వైసీపీ నుంచి టీడీపీకి మారిపోయాయి. ప్రత్యేకించి గుంటూరులో వైసీపీ అధికారాన్ని నిలబెట్టుకునే దిశగా నగర మాజీ మేయర్ కావటి మనోహర్ నాయుడు తీవ్రంగా కష్టపడ్డారు. అయితే ఆయనకు పార్టీ నుంచి పెద్దగా మద్దతు లభించలేదన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆయన ఏకంగా గుంటూరు మేయర్ పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత పెద్దగా కష్టం లేకుండానే టీడీపీ గుంటూరు మేయర్ పీఠాన్ని వైసీపీ నుంచి లాగేసుకుంది.
ఈ పరిణామాలపై ఒక్క అంబటి రాంబాబు తప్పించి పెద్దగా మాట్లాడిన నేతలే లేరు. నిన్నటిదాకా ఈ వ్యవహారంపై నోరు విప్పని వైసీపీ తాజాగా ఆదివారం కావటి మనోహర్ నాయుడుతో పాటు మరో ఇద్దరు కార్పొరేటర్లు మర్రి అంజలి, యాట్ల రవికుమార్ లపై సస్పెన్షన్ వేటు వేసింది. వీరు ముగ్గురితో పాటు చాలా మంది కార్పొరేటర్లు వైసీపీని వీడి టీడీపీలో చేరిపోయారు కూడా. అయితే వారిపై ఎలాంటి చర్యల మాటను వైసీపీ ప్రస్తావించకపోవడం గమనార్హం. ఎప్పుడో జరిగిపోయిన వ్యవహారాలపై ఇంత ఆలస్యంగా చర్యలు తీసుకోవడం, అది కూడా అరకొరగానే వైసీపీ చర్యలు తీసుకోవడంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది.
ఇదిలా ఉంటే… టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గ పరిధిలో కూడా పలువురు పార్టీ నేతలపై వైసీపీ చర్యలు తీసుకుంది. కుప్పం మునిసిపాలిటీతో పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరించారని ఆరోపిస్తూ 10 మంది కౌన్సిర్లపై వైసీపీ సస్పెన్షన్ వేటు వేసింది. ఇక కుప్పం పరిధిలోని శాంతిపురం మండల పరిధిలోని ఓ జడ్పీటీసీతో పాటు మరో ఐదుగురు స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులపైనా వైసీపీ వేటు వేసింది. ఈ చర్యలతో కుప్పం పరిధిలో మొత్తంగా 16 మందిపై వైసీపీ చర్యలు తీసుకున్నట్టు అయ్యింది.