తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “నా స్కూల్ బీజేపీ. కాలేజీ టీడీపీ.. ఉద్యోగం కాంగ్రెస్‌లో” అంటూ.. వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌లోని శిల్ప కళా వేదికలో జరిగిన కార్యక్రమం లో ఆయన పాల్గొన్నారు. బీజేపీ సీనియర్ నాయకుడు.. ప్రస్తుతం హరియాణ గవర్నర్‌గా ఉన్న బండారు దత్తాత్రేయ రచించిన.. “ప్రజల కథే.. నా ఆత్మకథ” పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. దీనిలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
తనకు బండారు దత్తాత్రేయ, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిలతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని తెలిపా రు. జాతీయ రాజకీయాల్లో వాజ్‌పేయికి ఉన్న గౌరవం.. రాష్ట్ర స్థాయిలో దత్తాత్రేయకు ఉందని చెప్పారు. దత్తాత్రేయకు ప్రత్యేక రాజకీయ పాఠశాల ఉందన్న ఆయన.. అందరితోనూ కలిసిపోయే వ్యక్తిత్వం ఆయన సొంతమని చెప్పారు. తనకు.. దత్తాత్రేయ, కిషన్ రెడ్డి కుటుంబాలతో చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయని సీఎం చెప్పుకొచ్చారు.
“నా స్కూల్ చదువు బీజేపీలో, కాలేజీ చదువు టీడీపీలో.. ఉద్యోగం రాహుల్ గాంధీ వద్ద చేస్తున్నా” అని వ్యాఖ్యానించారు. ఇతర పార్టీల నాయకులో సన్నిహిత సంబంధాలు ఉండడం తప్పుకాదన్న రేవంత్ రెడ్డి.. వాటిని దాచుకోవాల్సిన అవసరం లేదన్నారు. దత్తా త్రేయ రాజకీయ విధానాలు.. ఆయన అవలంబించే తీరు.. వంటివి ప్రతి ఒక్కరికీ స్ఫూర్తి దాయకమని పేర్కొన్నారు. జంటనగరాల్లో కష్టం వస్తే ప్రజలకు గుర్తుకు వచ్చే నాయకులు పీజేఆర్, దత్తాత్రేయ అని అలా ప్రజలతో మమేకం అయిపోయారని చెప్పుకొచ్చారు.