కూటమి ప్రభుత్వంలో పార్టీల నాయకుల తీరు .. “అయితే ఏంటి?” అన్నట్టుగానే ఉంది. టీడీపీలోనే కాదు.. జనసేన, బీజేపీల్లో కూడా.. నాయకుల వ్యవహార శైలి.. ఆయా పార్టీల అధినేతలకు, అదిష్టానానికి కూడా తలనొప్పిగానే మారింది. అందరూ అని కాదు కానీ… కొందరు మాత్రం తమ తీరును మార్చుకోలేక పోతున్నారన్న చర్చ పార్టీలలో విస్తృతంగా సాగుతోంది. “సొంత పార్టీ.. అయితే ఏంటి?” అనే తరహాలో నాయకులు రాజకీయాలు చేస్తున్నారు.
తాజాగా అనంతపురం నాయకుల తీరుపై సీఎం చంద్రబాబు విస్మయం వ్యక్తం చేయగా.. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన నాయకుల వ్యవహారం.. ఇప్పటికీ జనసేనలో కాక రేపుతూనే ఉంది. ఒకరిద్దరు నాయకులు పార్టీ కార్యక్రమాల్లో ఉన్నా.. కొందరిని మాత్రమే కలుస్తున్నారు. కొందరితోనే టచ్‌లో ఉంటున్నారు. మిగిలిన వారిపై ఇతర ముద్రలు వేస్తున్నారు. ఇక, బీజేపీలో అయితే.. గత ఏడాది నుంచి ఉన్న విధానాలు ఇప్పటికీ మారలేదు.
పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో సీఎం చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఎంతో కృషి చేశారని ఒప్పుకొంటున్నా.. క్షేత్రస్థాయిలో మాత్రం నాయకులు రాజీ పడలేని పరిస్థితి నెలకొంది. విజయవాడలో అయితే.. ఎవరికి వారు అన్నట్టుగా కూటమి పార్టీల నాయకులు కార్యక్రమాలు చేపడుతున్నారు. తాజాగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని అందరూ లైట్ తీసుకున్నారు. ఇక, ‘యోగాంధ్ర’ కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబు, పవన్ ఎంతో సీరియస్‌గా తీసుకున్నారు.
ప్రధాని మోడీ ముందు పరువు కాపాడాలని కూడా.. వారు పార్టీ నాయకులకు అంతర్గత చర్చల్లో చెప్పుకొ చ్చారు. కానీ, ఏం లాభం. ఎవరూ కూడా ఈ కార్యక్రమానికి అంతగా సహకరించడం లేదు. దీంతో స్వచ్ఛంద సంస్థలు చేస్తున్న కార్యక్రమాలే హైలెట్ అవుతున్నాయి. ఈ విషయంలో పార్టీ నాయకుల మధ్య కలివిడి లేకపోవడంతో మూడు పార్టీల్లోనూ ఈ వ్యవహారం చర్చగా మారింది. ఇప్పటి వరకు ఎలా జరిగినా.. ఈ యోగాంధ్రను సక్సెస్ చేయాలని అధినేతలు చెబుతున్నారు. అయినా.. ‘అయితే ఏంటి?’ అనే టైపులో నాయకులు వ్యవహరిస్తుండడం గమనార్హం.